'ట్రంప్ వస్తే చస్తామనే భయమేస్తోంది'
ఫామ్ విల్లే: ఆర్థిక పరమైన అంశాలు, వలస విధానాలు, విదేశాంగ విధానంవంటి అంశాలపై అమెరికా ఉపాధ్యక్ష పదవికోసం బరిలో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి టిమ్ కైనే, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ పెన్స్ మధ్య తొలి చర్చా కార్యక్రమం హాట్ హాట్ గా ముగిసింది. ఈ ఇద్దరూ కూడా తమలో ఏ ఒక్కరం తమ బాసులకు(హిల్లరీక్లింటన్, డోనాల్డ్ ట్రంప్)లకు ఏ మాత్రం తక్కువ కాదనే స్థాయిలో చర్చకు దిగారు. ప్రతిసారి వీరు తమ అధ్యక్ష అభ్యర్థుల పేర్లను ప్రస్తావిస్తూ చర్చను కొనసాగించారు. ఇదే క్రమంలో తమ వ్యక్తిగత సామర్థ్యాలు, అనుభవాలు, వ్యూహాలు పంచుకున్నారు.
నవంబర్ 8న అమెరికా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్చ మరింత ఆసక్తికరంగా సాగింది. వర్జీనియాకు సెనేటర్ గా పనిచేస్తున్న టిమ్ కైనే తనకు స్థానికపరంగానే కాకుండా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కూడా తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, తమ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు తానే సరైన అభ్యర్థినని చెప్పుకున్నాడు. ఆమెను నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీక అంటూ కొనియాడారు. కమాండర్ ఇన్ చీఫ్ గా హిల్లరీకి మిక్కిలి సామర్థ్యం ఉందన్నారు.
డోనాల్డ్ ట్రంప్ కమాండర్ ఇన్ చీఫ్ అనే ఆలోచన చావు అనే భయాన్ని తెప్పిస్తోందంటూ వ్యాఖ్యానించారు. అనుక్షణం అవమానించే ట్రంప్ లాంటి వ్యక్తిని పెన్స్ ఎలా వెనుకేసుకొస్తున్నారో, ఆయన వ్యక్తినని ధైర్యంగా ఎలా చెప్పుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇక ఇండియానా గవర్నర్ గా పనిచేస్తున్న మైక్ పెన్స్ స్పందిస్తూ అదే స్థాయిలో కైనే విమర్షలను తిప్పికొట్టారు. అసలు ఆయన విమర్శలు పట్టించుకోకుండా ఇతర విషయాలు ప్రస్తావించారు. 'ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన అవమానాలు మాత్రమే నీకు గుర్తుండి ఉండొచ్చు. గత కొద్ది నెలలు హిల్లరీ కూడా అదే విషయాలు చెబుతున్నారు.
అయితే నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మేం ప్రపంచంలో భిన్న పార్శాలు చూశాము. ముఖ్యంగా మధ్యాసియాలో పరిస్థితులు ఏ మాత్రం అదుపులో లేకుండా మారిపోతున్నాయి. మేం గంటగంటకు సిరియాలో ఆ విషయాలను పరిశీలిస్తున్నాం. అవన్నీ కూడా గతంలో హిల్లరీ చేసిన చలవే' అంటూ విమర్శించారు. అనంతరం ట్రంప్ ఎగ్గొట్టిన పన్నుల గురించి, హిల్లరీ వివాదాస్పద ఈమెయిల్స్ వ్యవహారం గురించి మొత్తం తొమ్మిదిగంటలపాటు కొన్ని అంశాల వారిగా వీరి మధ్య చర్చా కార్యక్రమం జరిగింది. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థులు నిల్చొని పలు అంశాలపై మాట్లాడుకోగా ఉపాధ్యక్షులు మాత్రం దర్జాగా కూర్చొని చర్చించుకుంటారు.