
మళ్ళీ గెలిచిన నిక్కీ, హారిస్
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు కొందరు తమ తమ స్థానాల్లో విజయ బావుటా ఎగురవేశారు. దక్షిణ కరొలినా గవర్నర్ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ తరఫున, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున వరుసగా రెండోసారి గెలిచారు. నిక్కీ హెలీ 57.8 శాతం ఓట్లతో తన సమీప ప్రత్యర్థి విన్సెంట్ షెహీన్‌పై గెలిచారు. ఈ ఎన్నికల్లో దాదాపు 30 మంది దాకా ఇండియన్ అమెరికన్లు పోటీ చేశారు. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా హవా తగ్గడంతో డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేసినవారిలో చాలామంది ఓడిపోయారు. వారిలో ఇప్పటివరకూ 8 మంది మాత్రమే గెలిచారు.
23 ఏళ్లకే కాంగ్రెస్‌కు ఎన్నిక
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున 23ఏళ్ల నీరజ్ అంటానీ ఒహాయో నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికై సంచలం సృష్టించారు. గత ఏడాదే ఒహాయో స్టేట్ వర్సిటీనుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా పుచ్చుకున్న నీరజ్.. అమెరికాలోనే అతి పిన్న వయస్కుడైన కాంగ్రెస్ సభ్యుడుగా రికార్డుల కెక్కారు. రిపబ్లికన్ పార్టీ తరఫునే కనెక్టికట్‌నుంచి రిటైర్డ్ డాక్టర్ ప్రసాద్ శ్రీనివాసన్, ‘16 డిస్ట్రిక్ట్’ నుంచి జనక్ జోషీ ఎన్నికయ్యారు. డెమెక్రటిక్ పార్టీ తరఫున మిచిగన్‌నుంచి శ్యామ్ సింగ్ గెలిచారు. మేరీల్యాండ్‌లో కుమార్ భార్వే, అరుణా మిల్లర్ తమ సీట్లు దక్కించుకున్నారు. వాషింగ్టన్ స్టేట్‌లో డెమెక్రాట్ ప్రమీలా జయపాల్ సెనేట్‌కు ఎన్నికయ్యారు.
తులసీ గబ్బార్డ్ గెలుపు
ఇక, అమెరికన్ కాంగ్రెస్‌లో ఏకైక హిందూ సభ్యురాలైన తులసీ గబ్బార్డ్.. హవాయ్ సీటునుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున మంచి ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ అభ్యర్థి కవికా కౌలేపై తులసీ గెలిచారు. ఆమె తొలిసారి 2012లో ప్రతినిధుల సభకు ఎన్నిక య్యారు.