టోక్యో: ‘ఫ్రీగా నూడుల్స్ తినాలనుందా? అయితే కాస్త ముందుగా వచ్చి మా మెట్రో రైలు ఎక్కండి.. ఒక్కటి కాదు, రెండు రకాల నూడుల్స్ బౌల్స్‌ను ఫ్రీగానే ఇస్తాం. ఎంచక్కా ప్రశాంతంగా కూర్చొని, తింటూ వెళ్లొచ్చు’ అంటూ తాజాగా ఓ ప్రకటన చేసింది టోక్యో మెట్రో. ఇంతకీ ఈ ప్రకటన ఎందుకు చేసిందో తెలుసా? టోక్యో మెట్రోలో రోజుకు 72 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. సామర్థ్యానికి దాదాపు రెండింతలు ప్రయాణిస్తారు.
ఎంతగా ఇరుక్కుని నిలబడతారంటే కాలూచేయీ ఆడించడం కూడా కష్టమే. అలా కాకుండా ఉదయమే కొంచెం ముందుగా ఆఫీసుకు బయలుదేరేవారి సంఖ్యను పెంచేందుకే టోక్యో మెట్రో ఫ్రీఫుడ్ ఆఫర్ ప్రకటించింది. అందరూ ఒక్కసారిగా ఎగబడకుండా కనీసం కొందరైనా ఫ్రీ నూడిల్స్ కోసం ముందుగా ప్రయాణిస్తే తర్వాత ఆఫీసు వేళల్లో రద్దీ తగ్గుతుందనేది ఆలోచన. ముందస్తు ప్రయాణికుల సంఖ్య 2,500 వరకు ఉంటే వారికి ఉచితంగా ఒక్కొక్కరికి సోబా నూడిల్ బౌల్ ఇస్తారు. ఆ సంఖ్య 3,000 దాటితే సోబాతోపాటుగా టెంపూరా బౌల్ ఇస్తారు. అంటే డబుల్ బొనాంజా అన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment