
పెద్దదై.. చిన్నబోయింది!
చుట్టూ పచ్చదనంతో ఐదు ఎకరాల ఆహ్లాదకర స్థలం.. అందులో మూడంతస్తుల భవనం.. 28 బెడ్‌రూములు.. 19 రిసెప్షన్ గదులు.. 8 బాత్‌రూమ్‌లు.. ఓ పెద్ద బాల్‌రూం.. వెరసి మొత్తం 34,250 చదరపు అడుగుల్లో నిర్మాణం.. యూకేలోని బైడ్‌ఫోర్డ్ సమీపంలో ఓ హైవే పక్కనే ఉన్న ఈ మోర్టన్ హౌస్ అమ్మకానికి వచ్చింది.
యూకేలో సగటు ఇంటి కంటే 35 రెట్లు ఎక్కువగా, ఓ ఫుట్‌బాల్ మైదానంలో సగానికిపైగా ఉంటే ఈ పురాతన భవనాన్ని కొనుక్కోవాలంటే భారీ మొత్తమే వెచ్చించాలని అనుకుంటున్నారా? సాధారణంగా ఇంటి సైజు పెరిగేకొద్దీ ధర కూడా పెరుగుతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉండటం వల్లే చాలా తక్కువకు అమ్ముడుపోయింది. కేవలం 6 లక్షల పౌండ్లకే (దాదాపు రూ.5.85 కోట్లు) ఓ మిలియనీర్ దీన్ని సొంతం చేసుకున్నాడు.
సెంట్రల్ లండన్‌లో ఓ సింగిల్ బెడ్‌రూం ఫ్లాట్ కావాలంటే కనీసం 12 లక్షల పౌండ్లు చెల్లించాల్సిందే. అలాంటిది.. అందులో సగం ధరకే ఇంత భారీ భవనాన్ని సొంతం చేసుకోవడం చాలా చక్కని డీల్ అని ఈ ఒప్పందాన్ని కుదిర్చిన జేమ్స్ గిబ్స్ పేర్కొన్నారు.
ఈ ఇంటి ధరను 5 లక్షల పౌండ్లుగా నిర్ధారించి అమ్మకానికి పెట్టగా.. భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి ఆఫర్లు వచ్చినట్టు తెలిపారు. అన్నట్టు.. ఈ భవనం చాలా పురాతనమైనది. 1760లో దీని నిర్మాణం ప్రారంభించి 1820లో పూర్తిచేశారు. తర్వాత మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఇందులో ఆధునిక హంగులు కూడా సమకూర్చుకుంటూ వచ్చారు.