ఆమె ట్రాన్స్జెండర్ అయినందున..
పెషావర్: పాకిస్తాన్లో ఓ ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ జీవితం డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైపోయింది. దుండగుల దాడిలో శరీరంలోకి ఎనిమిది తూటాలు దిగిన పరిస్థితుల్లో ఉన్న ఆమెను.. ట్రాన్స్జెండర్ కావడం వలన పురుష వార్డులో ఉంచాలా లేక మహిళా వార్డులో ఉంచాలా అనే సందేహంతో డాక్టర్లు సుమారు నాలుగు గంటలు చికిత్స మొదలుపెట్టలేదు. దీంతో కీలక సమయంలో వైద్యం అందకపోవడం వలనే ఆమె మృతి చెందిందని తోటి ట్రాన్స్ జెండర్లు ఆరోపిస్తున్నారు.
ఖైబర్- పఖ్తున్ఖ్వ ప్రాంతంలో ట్రాన్స్జెండర్ యాక్టివిస్ట్ అలీషాపై ఆదివారం రాత్రి కొందరు దుండగులు గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ట్రాన్స్జెండర్ల హక్కులకై పోరాడుతున్న అలీషా వ్యవహారం నచ్చకే సాంప్రదాయకవాదులు ఈ దాడులకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. అయితే కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అలీషాను పెషావర్లోని 'లేడీ రీడింగ్ హస్పిటల్'కు తరలించారు. బుల్లెట్ గాయాలతో తీవ్ర రక్తస్రావం అవుతున్న అలీషాకు ట్రీట్మెంట్ చేయడంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. అంతేకాదు ఆ సమయంలో అలీషా స్నేహితులతో హాస్పిటల్ సిబ్బంది అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపనలున్నాయి. మృతి చెందడానికి ముందు సమాజంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న ట్రాన్స్జెండర్లను ప్రభుత్వం ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కోరింది.