బోట్‌ల్యాండ్
దీవిని ఐల్యాండ్ అంటారు. అదే దీవి బోట్‌లో ఉంటే... బోట్‌ల్యాండ్ అనాలిగా! అలాంటిదే ఈ యాట్ (కొంచెం పెద్దసైజు పడవ).
చుట్టూ నీళ్లు... నీళ్ల మధ్యలో ద్వీపం... ఆ ద్వీపంలో చిన్న ఇల్లు... ఆ ఇంటిలో మనం ఉంటే? భలేగా ఉంటుంది కదూ! ఆ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించే అవకాశం మనకు త్వరలో కల్పించబోతోంది... ట్రాపికల్ ప్యారడైజ్ ఐల్యాండ్.
ఐల్యాండ్ అన్నాం కాబట్టి అది సముద్రం మధ్యలో ఉంటుందనుకునేరు. ఇది సముద్రం మధ్యలో ఉండే దీవి కాదు.. సముద్రం పైన తేలియాడే దీవి. అన్ని హంగులతో ఓ యాట్‌లో అందంగా సృష్టించిన దీవి. కరీబియన్, పాలినీసియా దీవుల స్ఫూర్తితో దీన్ని తయారు చేశారు.
దాదాపు 295 అడుగుల పొడవుండే ఈ సూపర్ యాట్ అడుగు భాగాన్ని ఉక్కుతో నిర్మిస్తారు. పైభాగం మాత్రం అల్యూమినియం, ఫైబర్ రీఎన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్‌తో సిద్ధం చేస్తారు. యాట్ వెనుక భాగంలో పర్వతం మాదిరిగా కనిపిస్తున్నది కృత్రిమ అగ్నిపర్వతం.అయితే ఈ పర్వతం నుంచి లావా కాదు... నీరు వస్తుంది. అది జలపాతంలా ప్రవహించి ప్రవహించి నేరుగా ముందువైపున ఉండే స్విమ్మింగ్‌పూల్‌లోకి చేరుతుంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే కృత్రిమ బీచ్ ఉంటుంది. దాని చుట్టూ చక్కని కాటేజీలు, వాటి చుట్టూ పచ్చని చెట్లు కలిసి నిజంగానే ఓ దీవిలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఈ దీవిలో ఉండే చెట్లన్నీ సహజమైనవే కావడం మరో విశేషం. ఇవి కాక సినిమాహాలు, లైబ్రరీ, జిమ్ వంటివి అదనపు హంగులూ ఉన్నాయి. పదిమంది యాత్రికులకు సరిపోయే ఈ యాట్‌ని ‘యాట్ ఐల్యాండ్ డిజైన్’ అనే సంస్థ నిర్మిస్తోంది. ఇది గంటకు 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాదాపు ఐదేళ్ల క్రితమే దీని డిజైన్ పూర్తికాగా... ఈ ఏడాది నిర్మాణం పూర్తి చేసుకోనుంది!