ట్రంప్, పుతిన్‌ల బంధానికి బీటలు!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ట్రంప్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఇరుదేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని పక్కనబెట్టి.. పరస్పరం సహకారంతో ముందుకెళ్తామని ట్రంప్ చెప్తూ వచ్చారు. పుతిన్ సైతం ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడారు. రష‍్యా విషయంలో ట్రంప్ పోకడలపై హిల్లరీ వర్గం తీవ్రస్థాయిలో మండిపడింది కూడా. అయితే.. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే పరిస్థితిలో మార్పు వచ్చిందా? అంటే అవుననే అంటున్నారు నాటో మాజీ కమాండర్ జేమ్స్ స్టావ్‌రైడిస్.
ట్రంప్ ప్రభుత్వ వర్గాలు.. ప్రపంచంలో మంచిని సపోర్ట్ చేసే శక్తిగా రష్యాను భావించడంలేదని స్టావ్‌రైడిస్ వెల్లడించారు. ప్రస్తుతం ట్రంప్, రష్యాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్నాయని అన్నారు. సిరియాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆనుసరిస్తున్న విధానాలు.. ఆయన ఎంత క్లిష్టమైన భాగస్వామి అన్న విషయాన్ని వెల్లడిస్తున్నాయని స్టావ్‌రైడిస్ పేర్కొన్నారు. ఇటీవల సిరియాలో అమెరికా క్షిపణి దాడుల నేపథ్యంలో స్టావ్‌రైడిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా క్షిపణి దాడులను రష‍్యా ఖండించిన విషయం తెలిసిందే. అమెరికాది దూకుడు చర్య అని.. అంతర్జాతీయ ఒప్పందాలను ఆ దేశం ఉల్లంఘించిందని రష్యా పేర్కొంది.