మోదీని కాపీ కొట్టిన ట్రంప్.. దీపావళి విషెస్ కూడా..
న్యూయార్క్: డోనాల్డ్ ట్రంప్ అనగానే పరిచయం అవసరం లేకుండానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే వ్యక్తి. ఆయన ఒక్కో మాట ఒక సంచలనం. ఆయన ఇప్పటి వరకు మెక్సికన్లను అవమానించి ఉండొచ్చు.. ముస్లింలను తిట్టిపోసి ఉండొచ్చు. కానీ, అనూహ్యంగా భారతీయ అమెరికన్లను మాత్రం ట్రంప్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ 2014లో ప్రచార అస్త్రంగా ఉపయోగించిన వాక్యాన్ని కాపీ కొట్టి తన పేరిట ప్రచార వాక్యంగా ఉపయోగించారు. అది కూడా అచ్చం మోదీలాగే హిందీలో ఆ వాక్యాన్ని చెబుతూ అబ్బురపరిచారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఉన్న ట్రంప్ దీపావళి పండుగను పురస్కరించుకొని భారతీయ అమెరికన్లకు శుభాకాంక్షలు చెబుతూ ఒక ప్రకటన చేశారు. అందులో చక్కగా హిందీ భాషలో మాట్లాడారు. 'ఆప్ కీ బార్ ట్రంప్ సర్కార్'(ఈసారి ట్రంప్ ప్రభుత్వం) అంటూ వ్యాఖ్యానించాడు. ప్రధాని మోదీ గతంలో 2014లో 'ఆప్ కీ బార్ మోదీ సర్కార్' అంటూ ప్రచారంలో వాడిన విషయం తెలిసిందే.
అంతేకాదు, న్యూజెర్సీలో ఏర్పాటుచేసిన సమావేశానికి వచ్చిన హిందు భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంగా ఉన్న ఫుటేజీని ఈ ప్రకటనకు జతచేసి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలు చాలా బలంగా ఉంటాయని తాను హామీ ఇస్తున్నట్లు అందులో తెలిపారు. 'భారతీయ హిందూ వర్గం అమెరికన్ వైట్ హౌస్ కు చాలా దగ్గరి మిత్రులు. మేం హిందువులను ప్రేమిస్తాం. మేం భారత్ను ప్రేమిస్తాం. మోదీతో కలిసి పనిచేసే యోచన చేస్తున్నాను' అంటూ ఆయన ఆ ప్రకటన వీడియోలో మాట్లాడారు. గతవారం ఆయన కూతురు లారా ట్రంప్ వర్జీనియాలోని హిందూ ఆలయాన్ని సందర్శించి పూజలు కూడా నిర్వహించారట.