వాషింగ్టన్: కీలకమైన పన్ను సంస్కరణల బిల్లు అమెరికన్ సెనేట్‌లో అతి స్వల్ప మెజారిటీతో గట్టెక్కింది. దీంతో ఎట్టకేలకు అమెరికా చట్టసభల్లో అధ్యక్షుడు ట్రంప్ తన పట్టు నిరూపించుకున్నారు. 1.5 ట్రిలియన్ డాలర్ల(రూ. 96.7 లక్షల కోట్లు ) పన్ను ప్రణాళిక బిల్లుపై అధికార రిపబ్లికన్లలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేయడం, చివరి నిమిషంలో మార్పులు చేర్పుల నేపథ్యంలో ఒక దశలో బిల్లు ఆమోదం పొందుతుందా? అన్న సందిగ్ధం కొనసాగింది. శుక్రవారం రాత్రంతా సెనేట్‌లో బిల్లుపై సుదీర్ఘ చర్చ కొనసాగగా చివరకు 51–49 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది.
ఈ బిల్లును ఇంతకుముందే ప్రతినిధుల సభ ఆమోదించగా.. ఈ రెండింటిని సమన్వయం చేసి వైట్‌హౌస్‌కు పంపుతారు. గత 31 ఏళ్లలో అమెరికాలో ఇదే అతి పెద్ద పన్ను సంస్కరణ కావడం గమనార్హం. ఈ ఏడాది చివరికల్లా పన్ను సంస్కరణల చట్టాన్ని అమల్లోకి తేవాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. అదే జరిగితే అమెరికన్ కాంగ్రెస్‌లో ట్రంప్ సాధించిన తొలి విజయంగా పన్ను సంస్కరణల చట్టం నిలిచిపోతుంది. సెనేట్ ఆమోదం పొందాక ట్రంప్ ట్వీటర్‌లో స్పందిస్తూ.. ‘క్రిస్మస్‌కు ముందే తుది బిల్లుపై సంతకం కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పారు.
బిల్లు ఆమోదం కోసం మొదటి నుంచి ట్రంప్ ఎంతో పట్టుదలగా ఉండటంతో జోరుగా లాబీయింగ్ కొనసాగింది. పదేళ్ల కాలానికి 1.5 ట్రిలియన్ డాలర్ల పన్ను ప్రణాళికను రిపబ్లికన్లలో కొందరు వ్యతిరేకించారు. దీంతో అర్ధరాత్రి వరకూ వారిని బుజ్జగించేందుకు ట్రంప్ అనుకూల వర్గం శ్రమించింది. బిల్లుకు చేతిరాతతో సవరణలు చేర్చడంపై డెమొక్రాట్లు అభ్యంతరం చెప్పారు. రిపబ్లికన్లలో బాబ్ కార్కర్ ఒక్కరే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. బిల్లులో కార్పొరేట్ పన్నును 20 శాతానికి తగ్గించారు. అన్ని ఆదాయ వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పన్ను రేట్లను తగ్గించారు.
చట్టంలో ధనికులకే పట్టం..
ఈ చట్టంతో ఎక్కువ లాభపడేది ధనికులేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తానని గతేడాది ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. అయితే తాజా చట్టంతో ప్రజల ఆదాయాల్లో అసమానతలను తగ్గకపోగా, మరింత పెరుగుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ పన్నును 35 నుంచి 20 శాతానికి తగ్గించడమే ఈ బిల్లులోని ప్రధానాంశం. దీనివల్ల ధనికులు అడ్డగోలుగా లాభపడతారని అంచనా వేస్తున్నారు.
ఈ చట్టం అమల్లోకి వస్తే పెట్టుబడిదారులు, ఎగ్జిక్యూటివ్‌ల చేతుల్లోని షేర్ల విలువ ఆకాశం వైపు పరుగులు పెట్టి వారి సంపద పెరుగుతుంది. కంపెనీల యజమానులు పన్నులు ఎగవేయడానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. అమెరికా సమాజంలో ఆర్థిక తారతమ్యాల్ని తగ్గించే లక్ష్యంతో రూపొందించిన చట్టం చివరికి వ్యతిరేక ఫలితాలిస్తాయని భయపడుతున్నారు. ఈ బిల్లు చట్టమైతే సంపన్నులు, వారి పిల్లలు ఎక్కువ లబ్ధిపొందుతారు. వారసత్వంగా వారికి సంక్రమించే ఆస్తులపై పన్ను రేటు తగ్గిపోతుంది.
దిగువ, మధ్యస్థాయి కార్మికులకు దక్కే వనరులు తగ్గడం వల్ల వారు పిల్లల అవసరాలపై చేసే వ్యయం తగ్గుతుంది. ఆరోగ్య బీమా లేని అమెరికన్ల సంఖ్య పెరగొచ్చని న్యూయార్క్ వర్సిటీ ప్రొఫెసర్ బ్యాచెల్డర్ చెప్పారు. కొత్త బిల్లులో వ్యక్తిగత ఆదాయపన్ను రేట్ల ప్రతిపాదనలు ధనికులకు అనుకూలంగా ఉన్నాయి. సామాన్యులకు వ్యక్తిగత ఆదాయపన్ను భారం ఒక్కొక్కరికి 50 డాలర్లు తగ్గుతుంది. ఒక్క శాతమున్న అగ్రశ్రేణి ధనికుల్లో ఒక్కొక్కరికి 34,000 డాలర్ల మేరకు పన్ను భారం తగ్గుతుంది. ఎస్టేట్ పన్ను రేట్లను పూర్వస్థాయికి తీసుకెళ్లే ప్రతిపాదనలు ధనికులకే లాభంగా ఉన్నాయి. చట్టంతో పేద, మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గకపోవగా, దీర్ఘకాలంలో పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment