వాషింగ్టన్: అమెరికాలోకి అత్యంత నైపుణ్యవంతులైన విదేశీయులు ప్రవేశించడంలో హెచ్–1బీ వీసాలు మెరుగైన పాత్ర పోషించేలా వలస విధానాలు ఉండాలని అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కోరుకుంటోందని వైట్‌హౌజ్ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుత హెచ్–1బీ వీసాల విధానం ‘ఔట్ సోర్సింగ్’ నియామకాల మాదిరిగా ఉండకూడదని వారన్నారు. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా సంస్థలను అనుమతించేవే హెచ్1బీ వీసాలు. ప్రత్యేక నైపుణ్యాలు అంటే ఏంటో, హెచ్–1బీ వీసా కింద ఉపాధి అంటే ఏంటో పునర్నిర్వచించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. శ్వేతసౌధం ఉన్నతాధికారి క్రిస్ లిడ్డెల్ మాట్లాడుతూ ‘అత్యంత ప్రతిభావంతులైన విదేశీయులు మాత్రమే అమెరికాలో ఉండేలా చూసేందుకు ఆయన విధానాలు రూపొందిస్తున్నారు. ఈ రకమైన వలసలపైన మాత్రమే ఆయన సానుకూలంగా ఉన్నారు’ అని తెలిపారు.
‘హెచ్–1బీ’లను అడ్డుకోవడం పెరిగింది: కంపీట్ అమెరికా
ట్రంప్ అధికారంలోకి వచ్చాక హెచ్–1బీ వీసా దరఖాస్తుల తిరస్కరణ, దరఖాస్తులను తొక్కిపెట్టడం తదితరాలు పెరిగాయని కంపీట్ అమెరికా ఆరోపించింది. సాంకేతిక దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థల సమాఖ్యయే ఈ కంపీట్ అమెరికా. ‘హెచ్–1బీ వీసాల జారీలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో 3 మార్పులను గమనించాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు అమెరికా కంపెనీల హెచ్–1బీ వీసాల దరఖాస్తులను ఎక్కువ సంఖ్యలో తొక్కిపెడుతున్నారు. ఈ విధంగా చేయడానికి మీకు చట్టబద్ధంగా అధికారం లేదు. మీ విధానాలు, పద్ధతులపై కంపెనీలకు స్పష్టత లేకుండా పోతోంది. దీంతో విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న కంపెనీలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది’ అని అమెరికా హోంలాండ్ సెక్రటరీకి, వలస సేవల విభాగం డైరెక్టర్‌కు ఈ నెల 1న కంపీట్ అమెరికా లేఖలు రాసింది. గత 18 నెలల్లో హెచ్1బీ దరఖాస్తులను తిరస్కరించడం, రిక్వెస్ట్స్ ఫర్ ఎవిడెన్స్‌లను కోరడం పెరిగిందని కంపీట్ అమెరికా ఆరోపించింది.
హెచ్–4పై ప్రజాభిప్రాయం తీసుకుంటాం
హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతుల రద్దు విషయంపై ప్రజాభిప్రాయం కోరతామని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. హెచ్–4 వీసాలు ఉన్న వారూ ఉద్యోగాలు చేసుకునేందుకు గతంలో ఒబామా సర్కారు అనుమతులివ్వడం తెల్సిందే. హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులను రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వలస సేవల విభాగం డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు. హోండురాస్, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారికి శరణార్థి హోదా ఇవ్వకూడదంటూ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత శరణార్థి చట్టం కింద ఈ దేశాల నుంచి వచ్చే వారికి అమెరికాలో ఆశ్రయం లభిస్తోంది. ఇకపై కొన్ని అధికారిక మార్గాల్లో వస్తేనే శరణార్థి హోదా దక్కుతుందంటూ అమెరికా న్యాయ విభాగం, హోంలాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపాయి.
వృత్తి నిపుణులకే హెచ్–1బీ
Published Sat, Nov 10 2018 3:33 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment