Out Sourcing policy
-
అవుట్ సోర్సింగ్ పాలసీపై గైడ్‌లైన్స్ విడుదల
ముంబై: కీలకమైన నిర్వహణ సేవలను అవుట్సోర్స్ (ఇతరులకు అప్పగించడం) చేయరాదంటూ కోపరేటివ్ బ్యాంకులను (సహకార బ్యాంకులు) ఆర్బీఐ ఆదేశించింది. ‘‘కోపరేటివ్ బ్యాంకులు ఆర్థిక సేవలను అవుట్సోర్స్ చేసుకోవచ్చు. కానీ, కీలక నిర్వహణ విధులైన.. విధానాల రూపకల్పన, ఇంటర్నల్ ఆడిట్, నిబంధనల అమలు, కేవైసీ నిబంధనల అమలు, రుణాల మంజూరు, పెట్టుబడుల నిర్వహణ సేవలను ఇతరులకు అప్పగించొద్దు’’ అని ఆర్బీఐ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కోపరేటివ్ బ్యాంకులు ఆర్థిక సేవలను అవుట్సోర్స్ చేసే విషయంలో రిస్క్ నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. రిస్క్ పర్యవేక్షణ కోసం నిపుణులను (మాజీ ఉద్యోగులు సైతం) నిబంధనల మేరకు నియమించుకోవడానికి వీలు కల్పించింది. అవుట్సోర్స్ అంటే.. కోపరేటివ్ బ్యాంకుల కార్యకలాపాలను మూడో పక్షం నిర్వహించడంగా స్పష్టత ఇచ్చింది. వ్యయాలను తగ్గించుకునేందుకు, నిపుణుల సేవలను పొందేందుకు కోపరేటివ్ బ్యాంకులు పలు కార్యకలాపాలను అవుట్సోర్స్ ఇస్తుంటాయి. ఇలా సేవలను వేరే వారికి అప్పగించే విషయంలో వచ్చే సమస్యలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు నిబంధనలను తీసుకొచ్చింది. చదవండి: ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష్యం దిశగా పెట్టుబడుల ఉపసంహరణ -
వృత్తి నిపుణులకే హెచ్–1బీ
వాషింగ్టన్: అమెరికాలోకి అత్యంత నైపుణ్యవంతులైన విదేశీయులు ప్రవేశించడంలో హెచ్–1బీ వీసాలు మెరుగైన పాత్ర పోషించేలా వలస విధానాలు ఉండాలని అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం కోరుకుంటోందని వైట్‌హౌజ్ ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. ప్రస్తుత హెచ్–1బీ వీసాల విధానం ‘ఔట్ సోర్సింగ్’ నియామకాల మాదిరిగా ఉండకూడదని వారన్నారు. కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా సంస్థలను అనుమతించేవే హెచ్1బీ వీసాలు. ప్రత్యేక నైపుణ్యాలు అంటే ఏంటో, హెచ్–1బీ వీసా కింద ఉపాధి అంటే ఏంటో పునర్నిర్వచించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. శ్వేతసౌధం ఉన్నతాధికారి క్రిస్ లిడ్డెల్ మాట్లాడుతూ ‘అత్యంత ప్రతిభావంతులైన విదేశీయులు మాత్రమే అమెరికాలో ఉండేలా చూసేందుకు ఆయన విధానాలు రూపొందిస్తున్నారు. ఈ రకమైన వలసలపైన మాత్రమే ఆయన సానుకూలంగా ఉన్నారు’ అని తెలిపారు. ‘హెచ్–1బీ’లను అడ్డుకోవడం పెరిగింది: కంపీట్ అమెరికా ట్రంప్ అధికారంలోకి వచ్చాక హెచ్–1బీ వీసా దరఖాస్తుల తిరస్కరణ, దరఖాస్తులను తొక్కిపెట్టడం తదితరాలు పెరిగాయని కంపీట్ అమెరికా ఆరోపించింది. సాంకేతిక దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ తదితర సంస్థల సమాఖ్యయే ఈ కంపీట్ అమెరికా. ‘హెచ్–1బీ వీసాల జారీలో ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో 3 మార్పులను గమనించాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు అమెరికా కంపెనీల హెచ్–1బీ వీసాల దరఖాస్తులను ఎక్కువ సంఖ్యలో తొక్కిపెడుతున్నారు. ఈ విధంగా చేయడానికి మీకు చట్టబద్ధంగా అధికారం లేదు. మీ విధానాలు, పద్ధతులపై కంపెనీలకు స్పష్టత లేకుండా పోతోంది. దీంతో విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్న కంపెనీలకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది’ అని అమెరికా హోంలాండ్ సెక్రటరీకి, వలస సేవల విభాగం డైరెక్టర్‌కు ఈ నెల 1న కంపీట్ అమెరికా లేఖలు రాసింది. గత 18 నెలల్లో హెచ్1బీ దరఖాస్తులను తిరస్కరించడం, రిక్వెస్ట్స్ ఫర్ ఎవిడెన్స్‌లను కోరడం పెరిగిందని కంపీట్ అమెరికా ఆరోపించింది. హెచ్–4పై ప్రజాభిప్రాయం తీసుకుంటాం హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు, పిల్లలకు ఇచ్చే హెచ్–4 వీసాలకు ఉద్యోగానుమతుల రద్దు విషయంపై ప్రజాభిప్రాయం కోరతామని ట్రంప్ ప్రభుత్వం వెల్లడించింది. హెచ్–4 వీసాలు ఉన్న వారూ ఉద్యోగాలు చేసుకునేందుకు గతంలో ఒబామా సర్కారు అనుమతులివ్వడం తెల్సిందే. హెచ్–4 వీసాలకు ఉద్యోగ అనుమతులను రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వలస సేవల విభాగం డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు. హోండురాస్, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వారికి శరణార్థి హోదా ఇవ్వకూడదంటూ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత శరణార్థి చట్టం కింద ఈ దేశాల నుంచి వచ్చే వారికి అమెరికాలో ఆశ్రయం లభిస్తోంది. ఇకపై కొన్ని అధికారిక మార్గాల్లో వస్తేనే శరణార్థి హోదా దక్కుతుందంటూ అమెరికా న్యాయ విభాగం, హోంలాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపాయి. -
సింగరేణికి వయోభారం
కొత్తగూడెం(ఖమ్మం): సింగరేణికి యువరక్తం ఎక్కించాల్సిన సమయం ఆసన్నమైంది. సంస్థలో పనిచేసే కార్మికుల్లో అత్యధికులు 40 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. ఔట్ సోర్సింగ్ విధానంతో రోజురోజుకు కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరుగుతోంది. పర్మనెంట్ కార్మికులు గణనీయంగా తగ్గిపోయారు. నూతన ఆర్థిక విధానాల్లో భాగంగా ఈ పరిస్థితి తలెత్తింది. ఖాళీల భర్తీకి అంతర్గత నియామకాలపై దృష్టి సారిస్తున్న యాజమాన్యం కొత్తగా నియామకాలు చేపట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో 2015లో రిటైర్డయ్యే కార్మికుల సంఖ్య 2 వేల వరకు ఉండడం గమనార్హం. 40 ఏళ్ల పైబడిన వారే ఎక్కువ.. 1990 నుంచి సింగరేణి సంస్థలో ఆర్థిక సంస్కరణలు, నూతన యాంత్రీకరణ అమల్లోకి రాగా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. సంస్థలో వీఆర్ఎస్, గోల్డెన్ షేక్ హ్యాండ్ స్కీంలను అమల్లోకి తెచ్చారు. డిపెండెంట్ ఎంప్లాయీమెంట్‌ను కూడా పూర్తిగా ఎత్తి వేశారు. 1990కి పూర్వం సంస్థలో 1.20 లక్షల మంది కార్మికులు ఉండగా తర్వాత పద్నాలుగేళ్లలో ఆ సంఖ్య సగానికి తగ్గింది. గత పదిహేనేళ్లుగా కొత్తగా నియామకాలు లేవు. టెక్నికల్ విభాగంలో ఇంజినీర్లను మాత్రమే అరకొరగా నియమిస్తున్నారు. పాతవారే కొనసాగుతుండడంతో ప్రస్తుత కార్మికుల్లో 80 శాతం మంది 40 ఏళ్ల వయస్సు పైబడిన వారే. ఇందులో 50 ఏళ్లకు పైబడిన కార్మికుల సంఖ్య సగం వరకు ఉంది. యాంత్రికరణ.. ఔట్ సోర్సింగ్‌పై దృష్టి.. యాంత్రిరణ నేపథ్యంలో కోల్ఫిల్లింగ్ను సంస్థ విస్మరించింది. ఓపెన్‌కాస్టులపై ఎక్కువగా దృష్టి సారించి భూగర్భ గనుల్లో ఎల్‌హెచ్‌డీ, ఎల్ఈడీ యంత్రాలను ప్రవేశపెట్టడంతో గతంలో ఉన్న తట్టా చెమ్మస్ సంస్కృతి కనుమరుగైంది. ఇలా ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నా.. నియామకాలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం కాంట్రాక్ట్ కార్మికులను భూగర్భ గనుల్లోనూ పనులకు వినియోగించుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ప్రస్తుతం సింగరేణిలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. అనారోగ్యాల బారిన కార్మికులు నియామకాలు విస్మరిస్తుండడంతో పనిలో మెళకవలు తెలిసిన కార్మికులు తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే కార్పొరేట్ శాఖలో క్లరికల్ గ్రేడ్ నియామకాల్లో జాప్యం చేయడం వల్ల ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఉన్న కార్మికులపై పనిభారం పెరిగి అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తోంది. ఈ ఏడాది పెద్దసంఖ్యలో రిటైర్మెంట్లు ఉన్నందున రిక్రూట్మెంట్పై యాజమాన్యం దృష్టిపెట్టాలనే డిమాండ్ విన్పిస్తోంది.