ట్రంప్, కిమ్‌ శాంతి మంత్రం | Trump's Historic Summit With Kim Jong Un in Singapore | Sakshi
Sakshi News home page

ట్రంప్, కిమ్‌ శాంతి మంత్రం

Published Wed, Jun 13 2018 1:09 AM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

Trump's Historic Summit With Kim Jong Un in Singapore - Sakshi

సింగపూర్‌: సింగపూర్‌ వేదికగా మంగళవారం ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌– ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు విజయవంతమైంది. ట్రంప్‌ ఆశించినట్లుగానే అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా భద్రతకు అమెరికా నుంచి కిమ్‌ హామీ పొందారు.

ఆరు నెలల క్రితం వరకూ యుద్ధానికి సై అన్న ఈ ఇరువురు నేతలు సింగపూర్‌ సదస్సులో శాంతి మంత్రం జపించి చరిత్ర లిఖించారు. మంగళవారం దాదాపు 45 నిమిషాల పాటు ట్రంప్, కిమ్‌లు ఏకాంతంగా చర్చించారు. అనంతరం ఇరు దేశాల ప్రతినిధులతో కలసి వారు దౌత్యస్థాయి చర్చలు నిర్వహించారు.మీడియా సమక్షంలో సంయుక్త ప్రకటనపై రెండు దేశాల అధినేతలు సంతకాలు చేశారు. సదస్సు అనంతరం ట్రంప్‌ మాట్లాడుతూ.. చర్చలు నిజాయితీగా, ఫలప్రదంగా జరిగాయని, కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ ప్రక్రియ అతి త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు.

అణునిరాయుధీకరణకు ఉత్తర కొరియా సమ్మతించిన నేపథ్యంలో దక్షిణ కొరియాతో కలసి చేస్తున్న ఉమ్మడి సైనిక విన్యాసాల్ని నిలిపివేస్తామని కిమ్‌కు హామీనిచ్చినట్లు ఆయన చెప్పారు. అయితే అణునిరాయుధీకరణపై పురోగతి కనిపించేంత వరకూ ఉత్తర కొరియాపై ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తామని ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికాతో గత వైరాన్ని పక్కనపెట్టి ముందుకు సాగుతామని, ప్రపంచం ఒక గొప్ప మార్పును చూడబోతుందని కిమ్‌ చెప్పారు.  

ఇరు దేశాల మధ్య నూతన సంబంధాలు నెలకొల్పేందుకు, కొరియా ద్వీపకల్పంలో శాశ్వతమైన శాంతి శకం ప్రారంభం కోసం ట్రంప్, కిమ్‌లు విస్తృత స్థాయిలో, నిజాయితీతో తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు’ అని సదస్సు అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉ.కొరియా భద్రతకు హామీ ఇచ్చేందుకు ట్రంప్‌ అంగీకరించారని, కొరియా ద్వీపకల్పంలో సంపూర్ణ అణు నిరాయుధీకరణకు కట్టుబడి ఉన్నట్లు కిమ్‌ మరోసారి స్పష్టం చేశారని అందులో తెలిపారు.  

ఊహించిన దాని కంటే గొప్పగా: ట్రంప్‌
రెండు వారాల క్రితం వరకూ అసలు సదస్సు జరుగుతుందా? లేదా? అని ఎన్నో సందేహాలు.. అనేక ఊహించని మలుపుల మధ్య చివరకు సింగపూర్‌లోని సెంటోసా ద్వీపంలో ఉన్న అత్యంత విలాసవంతమైన కెపెల్లా హోటల్లో ట్రంప్, కిమ్‌ భేటీ సాఫీగా సాగింది.

సదస్సు ముగిసిన అనంతరం మీడియా సమక్షంలో కిమ్‌తో కలసి సంయుక్త ప్రకటనపై ట్రంప్‌ సంతకం చేస్తూ.. ‘మేం సమగ్రమైన ఉమ్మడి పత్రంపై సంతకం చేస్తున్నాం. మా ఇద్దరి మధ్య భేటీ ఊహించిన దాని కంటే గొప్పగా జరిగింది. ఉత్తర కొరియా అణునిరాయుధీకరణను నిజం చేసేందుకు పూర్తి నిబద్ధతతో ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశాం. ఆ దేశంతో కలసి కొత్త చరిత్రకు నాంది పలికేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని చెప్పారు.

ఒప్పందం అమలుపై కలసి పనిచేస్తాం
దాదాపు గంట సేపు విలేకరులతో భేటీ వివరాల్ని ట్రంప్‌ వెల్లడించారు. ‘భారీ క్షిపణుల్ని పరీక్షించే కేంద్రాన్ని ఇప్పటికే నాశనం చేసినట్లు కిమ్‌ నాకు చెప్పారు’ అని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ట్రంప్‌ పేర్కొనలేదు. అణు నిరాయుధీకరణ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘మేం ఆ ప్రక్రియను చాలా త్వరలో ప్రారంభించనున్నాం.

అణునిరాయుధీకరణ ప్రక్రియ ఎప్పుడు, ఎలా చేపట్టాలన్న వివరాలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశమయ్యే అవకాశముంది. ఈ ఒప్పందం విజయవంతమయ్యేందుకు ఇతర దేశాలతో కలసి పనిచేస్తున్నాం. ఒప్పందం అమలు అంశంపై వచ్చేవారం జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌తో చర్చిస్తాను. అలాగే దక్షిణ కొరియా, జపాన్, చైనాలతో కూడా కలసి పనిచేస్తాం’ అని ట్రంప్‌ చెప్పారు.

అయితే ఉ.కొరియా అణు నిరాయుధీకరణలో పురోగతి కనిపించేంత వరకూ ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ‘దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాలు ఆపేస్తాం. వాటిని రెచ్చగొట్టే చర్యలుగా కిమ్‌ భావిస్తున్నారు. అందువల్ల ఆ విన్యాసాల్ని నిలిపేస్తామని హామీనిచ్చాను. మాకు కూడా ఎంతో డబ్బు ఆదా అవుతుంది’ అని ట్రంప్‌ చెప్పారు. ఉ.కొరియా నుంచి రక్షణ కోసం దక్షిణ కొరియా లో 30 వేల మంది అమెరికా సైనికులున్నారు.
 
కిమ్‌తో ప్రత్యేక బంధం ఏర్పడింది
‘ఈ రోజు జరిగిన భేటీ పట్ల నేనెంతో గర్వపడుతున్నా. కిమ్‌తో నాకు చాలా ప్రత్యేకమైన బం ధం ఏర్పడింది. కిమ్‌ చాలా తెలివైన వ్యక్తి, సమర్ధుడైన నాయకుడు. తగిన సమయంలో ఆయ న్ను వైట్‌హౌజ్‌కు ఆహ్వానిస్తాం. సమయం వచ్చినప్పుడు నేనూ ప్యాంగ్‌యాంగ్‌కు వెళ్తా’ అని భేటీ వివరాల్ని తెలిపారు. ఉత్తర కొరియా ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అని ప్రశ్నించగా.. ‘అది ఆ దేశం, దేశ ప్రజలు నిర్ణయించుకుంటారు’ అని సమాధానమిచ్చారు.  

గొప్ప మార్పును చూడబోతోంది
‘గతాన్ని విడిచిపెట్టాలని మేం నిర్ణయించుకున్నాం’ అని కిమ్‌ చెప్పారు. ప్రపంచం గొప్ప మార్పును చూడబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అణ్వాయుధాల్ని విడిచిపెడతారా? అని విలేకరులు కిమ్‌ను ప్రశ్నించగా.. ‘ము న్ముందు అనేక సవాళ్లు ఉండవచ్చు. అయితే వాటి పరిష్కారం దిశగా ట్రంప్‌తో సమాలోచనలు జరుపుతాం. సదస్సుకు సంబంధించి రేకెత్తిన అన్ని రకాల అనుమానాలు, ఊహాగానాల్ని మేం అధిగమించాం. శాంతి ప్రక్రియకు ఈ భేటీ ఎంతో మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. 
 
ట్రంప్‌ను గౌరవిస్తూ...
ఉ.కొరియా సంస్కృతికి అద్దం పట్టేలా ట్రంప్‌ కంటే ఏడు నిమిషాల ముందే కిమ్‌ హోటల్‌కు చేరుకున్నారని ప్యాంగ్‌యాంగ్‌ మీడియా పేర్కొంది. ఏదైనా సమావేశానికి వెళ్లేటప్పుడు పెద్ద వారి కంటే చిన్నవారే ముందుగా వెళ్లడం ఉత్తర కొరియా సంప్రదాయం. సదస్సు సందర్భంగా ట్రంప్‌ ఎరుపురంగు టై ధరించడం కిమ్‌ పట్ల గౌరవం చూపించడమేనని, తమ దేశ ప్రజలు ఎరుపు రంగును ఎక్కువ ఇష్టపడతారని ఉ.కొరియా మీడియా విశ్లేషించింది.

ఇరువురు స్నేహపూర్వకంగా...
ఉదయం సదస్సులో పాల్గొనేందుకు సింగపూర్‌లోని కెపెల్లా హోటల్‌కు తమ విలాసవంతమైన కార్లలో ట్రంప్, కిమ్‌లు చేరుకున్నారు. అనంతరం ఒకరి వైపునకు మరొకరు నడుచుకుంటూ వచ్చి.. కొద్ది క్షణాలు ముఖాముఖి చూసుకున్నారు. వెనుక అమెరికా, ఉత్తర కొరియా జాతీయ పతాకాలు రెపరెపలాడుతుండగా.. 12 సెకన్ల పాటు ఇద్దరూ కరచాలనం చేసుకున్నారు. కొద్దిసేపు చిరునవ్వుతో ముచ్చటించుకున్నారు.

భేటీకి ముందు మీడియాతో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘సమావేశం బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందనే ఆశాభావంతో ఉన్నాను. ఈ రోజు జరుగుతున్న సదస్సుకు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యాయి. మేం వాటన్నింటిని అధిగమించి ఇక్కడికి వచ్చాం’ అని చెప్పారు. అనువాదకులు మాత్రమే వెంట ఉండగా ఇరువురు సుమారు 45 నిమిషాలు నేరుగా చర్చలు జరిపారు. అణునిరాయుధీకరణ సహా దక్షిణ కొరియాతో అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు, ఉ.కొరియాపై ఆర్థిక ఆంక్షలు సహా అనేక అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

అనంతరం ప్రతినిధుల స్థాయి చర్చలు కొనసాగాయి. సదస్సు ముగియగానే కిమ్‌తో కలసి ట్రంప్‌ మధ్యాహ్న భోజనం చేశారు. ఈ భేటీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాశ్చాత్య, ఆసియన్‌ వంటకాల్ని వడ్డించారు. అనంతరం ఇరువురు నేతలు హోటల్‌ ఆవరణలో కొద్దిసేపు పచార్లు చేశారు. కిమ్‌తో భేటీ ముగించుకున్న అనంతరం ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ట్రంప్‌ అమెరికాకు పయనమయ్యారు. పసిఫిక్‌ మహా సముద్రంలోని వైమానిక స్థావరం గ్వామ్‌ మీదుగా హవాయి చేరుకుని.. అక్కడి నుంచి వాషింగ్టన్‌కు వెళ్తారు.


 సంయుక్త ప్రకటనలో ఏముంది?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ కలసి విడుదల చేసిన ప్రకటన సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. చాలా సంక్షిప్తంగా ఉన్న ఆ ప్రకటనలోని అంశాలు..
శాంతి, సుస్థిరత కోసం ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రెండు దేశాల మధ్య బంధం బలపడే చర్యలకు కట్టుబడి ఉండడం.
కొరియా ద్వీపకల్పంలో శాంతి, సుస్థిరతల కోసం ఇరు దేశాలు సంయుక్తంగా కృషి చేయడం.
 ఈ ఏడాది ఏప్రిల్‌ 27వ తేదీన ఉత్తర కొరియా తాను చేసిన అణునిరాయుధీకరణ ప్రకటనకు కట్టుబడి ఉండటం, సంపూర్ణ అణునిరాయుధీకరణ జరిగేలా కిమ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టడం.
 యుద్ధ ఖైదీల విడుదల, యుద్ధం సమయంలో ఆచూకీ తెలియకుండా పోయిన వారిని గుర్తిస్తే వారిని తిరిగి తమ తమ దేశాలకు అప్పగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండటం.
 ఈ సానుకూల దృక్పథాన్ని కొనసాగించటానికి విదేశాంగ మంత్రులు, అత్యున్నత స్థాయి అధికారుల స్థాయిలో వీలైనంత త్వరగా చర్చలు జరపడం.


80 ఏళ్ల నాటి టేబుల్‌ సాక్షిగా..
కిమ్, ట్రంప్‌ చారిత్రక సమావేశానికి 80 ఏళ్లనాటి టేబుల్‌ సాక్ష్యంగా నిలిచింది. సింగపూర్‌లోని కెపెల్లా హోటల్‌లో ఇద్దరు నేతలు, వారి ప్రతినిధులు ఈ టేబుల్‌ వద్దే కూర్చుని చర్చలు జరిపారు. కిమ్, ట్రంప్‌ సంతకాలు చేసి, సంయుక్త ప్రకటన వెలువరించింది కూడా ఇక్కడే. శిఖరాగ్ర భేటీ కోసం అమెరికా రాయబార కార్యాలయం ఈ టేబుల్‌ను అద్దెకు తీసుకుంది.

అనేక చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా నిలిచిన ఈ టేబుల్‌ వద్ద సింగపూర్‌ సుప్రీంకోర్టులో ఆసియాకు చెందిన ప్రథమ న్యాయమూర్తి వీ చొంగ్‌ జిన్‌ బాధ్యతలు చేపట్టారు. సింగపూర్‌ సుప్రీంకోర్టు జడ్జీల కోసం 1939లో స్థానిక పనివారు దిగుమతి చేసుకున్న టేకు కలపతో రూపొందించిన టేబుల్‌ పొడవు 4.3 మీటర్లు. ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో ఉండే ఈ టేబుల్‌ను పలువురు చీఫ్‌ జస్టిస్‌లు 1939 నుంచి రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణ సమయంలో వినియోగిస్తున్నారు.


 ‘బీస్ట్‌’ వద్దకు కిమ్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన అధికారిక కారు ‘బీస్ట్‌’కు సంబంధించిన విశేషాలను ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌తో పంచుకున్నారు. సోమవారం కపెల్లా హోటల్‌లో చరిత్రాత్మక చర్చల అనంతరం వారిద్దరూ హోటల్‌ బయట వ్యాహ్యాళికి వెళ్లినప్పుడు ఈ సన్నివేశం చోటు చేసుకుంది. అధ్యక్షులు ఇద్దరూ  కారు దగ్గరికి రాగానే ట్రంప్‌ కనుసైగతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ కారు తలుపును తెరిచారు. అధ్యక్షుడు ట్రంప్‌ ఆ కారుకు సంబంధించిన విశేషాలు కిమ్‌కు వివరించారు.

‘బీస్ట్‌’ ఎనిమిది టన్నుల బరువుతో అమెరికా అధ్యక్షుడికోసం తయారుచేసిన ప్రత్యేక వాహనం. ఎనిమిది అంగుళాల మందమైన బాడీతో, ఐదు అంగుళాల బుల్లెట్‌ ప్రూఫ్‌ రక్షణతో తయారైంది. కారు అద్దాలు సైతం బుల్లెట్‌ ప్రూఫ్‌తో తయారైనవే. రసాయన దాడులనుంచి సైతం తట్టుకునేలా అద్దాలను ప్రత్యేకంగా రూపొందించారు. బోయింగ్‌ 747 విమాన దృఢత్వంతో సమానంగా బీస్ట్‌ తలుపులు తయారయ్యాయి. పటిష్టమైన ఉక్కుతో తయారైన చక్రాలు, పంక్చర్‌ అయ్యే అవకాశం లేని టైర్లు ఆ కారులో విశేషం.

ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో కారు పంక్చర్‌అయినా ఆపాల్సిన అవసరం లేకపోవడం మరో విశేషం. కారులో పూర్తి స్థాయిలో ఇంధనం నింపినప్పటికీ అగ్నిప్రమాదానికి ఆస్కారం లేకుండా ప్రత్యేకమైన ఫోమ్‌ లాంటి పదార్థం ఉంటుంది. భద్రతపరంగా అత్యంత దుర్భేద్యంగా తయారైనప్పటికీ, అవసరమైన పక్షంలో కారులోనుంచే ప్రసంగించడానికి వీలుగా ఏర్పాట్లు కలిగి ఉంది. ఇన్ని విశేషాలు ఉన్నప్పటికీ ఇది ప్రత్యేకంగా ఒక కంపెనీ తయారీ అని చెప్పడానికి లేదు. కారు ఛాసిస్, తలుపులు, లైట్లు, పక్కన ఉండే అద్దాలు, డోర్‌ హ్యాండిల్స్‌ ఇవన్నీ వివిధ కంపెనీల నుంచి నమూనాగా తీసుకోవడం మరో ప్రత్యేకత.

 ఆహా.. ఏమి రుచి..!
ఆత్మీయ కరచాలనాలు.. చిరునవ్వులతో పలకరింపులు.. పక్కపక్కన నిల్చొని ఫొటోగ్రాఫర్లకు పోజులు.. ఇలా ఆద్యంతం ఆహ్లాదంగా సాగిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ల సమావేశం కలసి భోజనం చేయడంతో ముగిసింది. ఇద్దరూ జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ డైనింగ్‌రూమ్‌లోకి వెళ్లారు. అలా వెళుతూ వెళుతూ ట్రంప్‌ ఫొటోగ్రాఫర్లని ఉద్దేశించి ‘అందరూ మంచి పిక్‌ తీసుకున్నారా? మేమిద్దరం అందంగా, సన్నగా ఉన్నాం కదా‘ అంటూ చమత్కరించారు.

నేతలిద్దరూ తమ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వంటకాలను తృప్తిగా తిన్నారు. పాశ్చాత్య, ఆసియా దేశాల్లో పేరెన్నికగన్న రుచులు వారి మెనూలో ఉన్నాయి. రొయ్యల కాక్‌టైల్, అవకాడో సలాడ్, తేనె, నిమ్మకాయ కలిపిన మామిడికాయ కెరబు, దోసకాయని స్టఫ్‌ చేసి తయారు చేసే ఓయిసన్‌ అనే కొరియన్‌ వంటకాన్ని స్టార్టర్లుగా ఉంచారు. ఇక మెయిన్‌ కోర్సులో బీఫ్, పంది మాంసంతో చేసిన ప్రత్యేక వంటకాలు, ఫ్రైడ్‌ రైస్‌ విత్‌ చిల్లీ సాస్, ఆవిరిపై ఉడికించిన బంగాళాదుంపలు, గ్రీన్‌ గోబీ, కాడ్‌ చేప, సోయా, ముల్లంగి, ఇతర కాయగూరలతో చేసిన ప్రత్యేక వంటకాలు హైలైట్‌గా నిలిచాయి.

వీటితో పాటు రెడ్‌ వైన్‌ కూడా ఉంది. భోజనానంతర డెజర్ట్స్‌ విషయానికొస్తే డార్క్‌ చాక్లెట్, హాజెండాజ్‌ వెనిలా ఐస్‌క్రీమ్, ట్రోప్‌జెన్నీ అనే కేకులాంటి పదార్థం వడ్డించారు. ట్రంప్‌కి వెనీలా ఐస్‌క్రీమ్‌ అంటే పిచ్చి. కిమ్‌ ఆహార అలవాట్ల గురించి బయట ప్రపంచానికి అంతగా తెలీదు. ఆయన భోజన ప్రియుడనీ, ముఖ్యంగా చీజ్‌ ఉన్న విదేశీ వంటకాల్ని ఇష్టపడతారని అంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement