వాషింగ్టన్: నమస్తే.. అమెరికా పర్యటనకు విచ్చేసిన మోదీ గారికి హృదయపూర్వక ఆహ్వానం.. ‘హౌడీ మోదీ’ కార్యక్రమానికి రాలేకపోతున్నందుకు.. నన్ను క్షమించండి అన్నారు హిందూ మహిళా నేత, డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధి తులసి గబ్బార్డ్. ప్రస్తుతం డెమోక్రటిస్ పార్టీ సభ్యురాలైన తులసి గబ్బార్డ్.. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిదే. ఈ క్రమంలో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉండటంతో.. హౌడీ మోదీ కార్యక్రమానికి రాలేకపోతున్నాని తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు తులసి గబ్బార్డ్.
‘భారత్ గొప్ప ప్రజాస్వామ్య దేశం.. ఆసియా-పసిఫిక్ భూభాగంలో భారత్, అమెరికాకు గొప్ప మిత్రుడు. ఈ రెండు దేశాలు కలిసి వాతావరణ మార్పులు, అణు యుద్ధాన్ని ఎదుర్కొవడం, అణు విస్తరణను నివారించడం, ఇరు దేశాల ప్రజల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడం వంటి సమస్యలతో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం కలిసి పని చేయాల్సిందిగా కోరుతున్నాను అన్నారు. పురాతన వసుధైవ కుటుంబ సూత్రాన్ని ప్రస్తావిస్తూ.. ఇరు దేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు గబ్బార్డ్. రెండు రోజుల క్రితం గబ్బార్డ్ కావాలనే హౌడీ మోదీ కార్యక్రమానికి రావడం లేదంటూ ప్రచురించిన ఓ కథనాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ.. ‘ఇది పూర్తిగా అవాస్తవం. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వలన నేను దీనికి హాజరు కాలేకపోతున్నాను. కానీ మోదీ అమెరికా పర్యటన ముగిసేలోపు ఆయనను కలవాలనుకుంటున్నాను’ అంటూ గబ్బార్డ్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment