శాంతి కోసం వెళ్లి శవాలుగా మారారు..
అంకారా: టర్కీ రాజధాని అంకారాలో రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 95కు చేరింది. ఈ పేలుళ్ల దుర్ఘటనలో మరో 246 మంది గాయపడగా, ఇందులో 48 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. వామపక్ష సంఘాలు, కుర్దిష్ అనుకూల విపక్ష పార్టీలు తలపెట్టిన శాంతి ర్యాలీ లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు జరగడంతో శాంతి కోరుకోవాలంటూ ర్యాలీలో పాల్గొన్న చాలా మంది శవాలుగా మిగిలారు. కానీ, మరణించిన వారి శవాల మధ్య 'శాంతి, ప్రజాస్వామ్యం కావాలి' అని ర్యాలీ కోసం వచ్చిన వారు తీసుకొచ్చిన ప్లకార్డులు పడి ఉండటం చూపరులను కంటతడి పెట్టించక మానదు.
శాంతి, ప్రజాస్వామ్యం దేశానికి ఎంతో అవసరమని పేర్కొంటూ తలపెట్టిన ర్యాలీలో పేలుళ్లు జరిగి బీతావహ వాతావరణం నెలకొనడం గమనార్హం. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఘటనలో మృతిచెందిన వారి పట్ల సంతాపం ప్రకటించారు. నవంబర్ 1న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది.