38 వేల మంది ఖైదీల విడుదలకు ఆదేశం
అంకారా: తిరుగుబాటు కుట్రదారుల కోసం జైళ్లు ఖాళీ చేయించాలని టర్కీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 38 వేల మంది ఖైదీలను షరతులపై విడుదల చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం డిక్రీ జారీ చేసింది. రెండేళ్లు అంతకన్న తక్కువ జైలు శిక్ష పడిన ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలని ఆదేశించింది. హత్య, గృహహింస, లైంగిక వేధింపులు, తీవ్రవాదం, దేశానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా వ్యవహరించిన కేసులో శిక్షలు పడినవారిని విడుదల చేయరాదని స్పష్టం చేసింది. జూలై 1 తర్వాత నేరం చేసి జైలుకు వచ్చిన వారిని కూడా విడుదల చేయరాదని నిర్ణయించింది.
38 వేల మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు టర్కీ న్యాయశాఖ మంత్రి బెకిర్ బొజడాగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసేందుకు జూలై 15న సైన్యంలోని ఒక వర్గం తిరుగుబాటు చేసింది. ప్రజల సహకారంతో తిరుగుబాటును ప్రభుత్వం తిప్పికొట్టింది. తిరుగుబాటుకు కారణమయ్యారనే ఆరోపణలతో 35 వేల మంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది. 17 వేల మందిపైగా అరెస్ట్ చేసినట్టు టర్కీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరిలో సైనికులు, పోలీసులు, జడ్జిలు, జర్నలిస్టులు కూడా ఉన్నారు.