రన్ వే నుంచి జారిన విమానం
నేపాల్ రాజధాని ఖట్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. ఇస్తాంబుల్ నుంచి ఖట్మాండు వచ్చిన విమానం వాతావరణం సరిలేకపోవడంతో రన్వే నుంచి జారిపోయింది. అంతకు ముందు గంట సేపు దిగేందుకు అవకాశం లేకపోవడంతో ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. చివరకు ఎట్టకేలకు దిగేందుకు ప్రయత్నించినా.. విపరీతమైన మంచు, రన్వే కూడా తడిగా ఉండటంతో అక్కడి నుంచి జారిపోయింది. విమానం ముందుభాగం రన్వేను తాకింది.
విమాన సిబ్బంది సహా 227 మంది ప్రయాణికులున్నారని, అంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్ పోర్ట్ జీఎం బీరేంద్ర శ్రేష్ట తెలిపారు. మొత్తం ప్రయాణికులను, సిబ్బందిని అత్యవసర ద్వారం గుండా బయటకు తీసుకొచ్చారు. నేపాల్లో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయమైన త్రిభువన్ విమానాశ్రయంలో పొగమంచు ఎక్కువగా ఉండటంతో పలు స్వదేశీ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి, కొన్ని సర్వీసులను రద్దుచేశారు కూడా.