
వాషింగ్టన్ : కరోనావైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలకి ట్విటర్ చెక్ పెట్టింది. అయితే సదరు ట్వీట్‌లను తొలగించడం లేదా కనిపించకుండా ఉండేలా చేయడం కాకుండా ఫ్యాక్ట్ చెక్ మెసేజీలను జోడించింది. ‘కోవిడ్-19పై నిజాలు తెలుసుకోండి’ అనే లింక్ ఎంబెడెడ్ ట్యాగ్‌ను ట్విటర్ తగిలించింది. దీన్నీ క్లిక్ చేస్తే ‘5జీ సాంకేతిక పరిజ్ఞానంతో కరోనా రాదు’ అనే ఫ్యాక్ట్ చెక్ పేజీ ఓపెన్ అవుతోంది. ఈ పేజీలో 5జీకి కరోనాకు సంబంధంలేదనడానికి పలు మీడియాల్లో వచ్చిన కథనాలను నెటిజన్లకు అందుబాటులో ఉంచింది.(ట్విటర్ సంచలన నిర్ణయం)
5జీ టెక్నాలజీ కొవిడ్-19 వైరస్ వ్యాప్తికి కారణం అవుతోందంటూ ఇటీవల భారీగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. 5జీ సాంకేతిక పరిజ్ఞానం వాడకం, దీనికి సంబంధించిన తరంగాలతో మానవ వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతోందంటూ సామాజికమాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ అపోహలతోనే బ్రిటన్‌లో పలు సెల్ ఫోన్ టవర్లను అక్కడి ప్రజలు ధ్వంసం చేశారు.(5జీ వల్ల కరోనా సోకదు)
Comments
Please login to add a commentAdd a comment