ఉగ్రవాదుల ఇంట్లో ఉంటున్నామని రాసి..
లండన్: ఆంగ్లం భాష ఓ ముస్లిం కుర్రాడికి తంటాలు తెచ్చిపెట్టింది. స్పెల్లింగ్ తప్పు రాయడంవల్ల ఆ పదేళ్ల కుర్రాడిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. లండన్ లోని ల్యాంక్షైర్ పరిధిలోగల అక్రింగ్టన్లోని ఓ పాఠశాలలో పదేళ్ల బాలుడు చదువుతున్నాడు. అతడికి స్కూల్లో ఓ ఆంగ్ల పాఠానికి సంబంధించి ప్రశ్న పెట్టగా అందులో తాము ఎక్కడ ఉంటున్నామనే విషయాన్ని తప్పుగా రాశాడు.
ఇంతకు అతడు రాసిన తప్పేమిటని అనుకుంటున్నారా.. తాము టెర్రేసెడ్ హౌజ్ లో ఉంటున్నామని రాయడంరాక ఆ పిల్లాడు 'టెర్రరిస్టు హౌజ్' అని స్పెల్లింగ్ తప్పుగా రాశాడు. ఈ విషయం పోలీసులకు తెలిసి ఒక్కసారిగా అతడి ఇంటి ముందు వాలిపోయారు. ఇంటి వివరాలు, యజమాని వివరాలు నోట్ చేసుకున్నారు. ఆ పిల్లాడిపై పలు రకాల ప్రశ్నలు సంధించారు. నిజంగానే ఆ కుటుంబానికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయేమోనన్న అనుమానంతో ఇంట్లో ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకొని దాన్ని శోధించారు. పారిస్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత పాశ్చాత్య దేశాలు ప్రతి అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్న విషయం తెలిసిందే.