అందరూ సూసైడ్ నోట్ రాయండి!
లండన్: సాధారణంగా స్కూల్లో పిల్లలకు టీచర్లు హోంవర్క్ ఇవ్వడం సహజం. కానీ లండన్‌లో ఓ ఇంగ్లీష్ టీచర్ అత్యుత్యాహం చూపించారు. తరగతి గదిలో విద్యార్థులకు ఓ వింత హోంవర్క్ ఇచ్చాడు. సుమారుగా 60మందికి సూసైడ్ నోట్ రాయాలని సూచిస్తూ హోంవర్క్ ఇచ్చాడు. దీంతో విస్తుపోయిన విద్యార్థులు ఏమీ చేయాలో దిక్కుతోచక తల్లిదండ్లులకు చెప్పడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలముందు నిరసనకు దిగారు.
లండన్, కిడ్‌బ్రూక్ లోని థామస్ తాలీస్ అనే పాఠశాలలో ఈ ఘటన జరిగింది. తమకు ఇష్టమైన వారితో బాగా ఆనందంగా గడిపిన సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ, షేక్స్‌ఫియర్ రాసిన నవల్లో ఆత్మహత్య చేసుకున్న మాక్‌బెత్ పాత్ర తరహాలో సూసైడ్ నోట్ రాయమని ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఇది పిల్లలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనాలోచిత హోంవర్క్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓ విద్యార్థి తల్లి మాట్లాడుతూ తన కూతురు ఇది వరకు ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని, ఇప్పుడు ఇలా చేస్తే వారిపై ఈ సంఘటనలు ప్రభావం చూపిస్తాయని వాపోయారు. అయినా విద్యార్థులతో సూసైడ్ నోట్ రాయమని ఎలా చెప్తారని ప్రశ్నించారు.
దీనిపై పాఠశాల యాజమాన్యం స్పందించింది. విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పింది. ఇలాంటి పరిస్థితులు పురావృతం కాకుండా చూసుకుంటామని తెలిపింది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చింది.