సెవాస్టొపోల్: క్రిమియాను రష్యాలో కలుపుకోవడంపై పశ్చిమ దేశాలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని ఏమాత్రమూ లక్ష్య పెట్టని రష్యా తనదైన శైలిలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ క్రమంలో రష్యా అనుకూల దళాలు.. ఉక్రెయిన్ నేవీ చీఫ్ ను బుధవారం అదుపులోకి తీసుకున్నాయి. అదేవిధంగా క్రిమియాకు చెందిన రెండు ప్రధాన నౌకా స్థావరాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. దీంతో క్రిమియాపై రష్యా మరింత పట్టుసాధించినట్లయింది. ఈ నేపథ్యంలో డజన్ల మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా బలగాలు క్రిమియా నుంచి పంపించాయి. కాగా, కొందరు సైనికులు మాత్రం వెళ్లేందుకు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు. తాము 20 ఏళ్లుగా క్రిమియాలో ఉంటున్నామని, ఇప్పుడు పొమ్మంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. మరోపక్క, మాస్కో బలగాలు ఉక్రెయిన్ జెండాను తొలగించాయి.
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: అమెరికా
అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతను రష్యా ఏమాత్రమూ లక్ష్య పెట్టకుండా క్రిమియాను కలుపుకోవడంపై అమెరికా తీవ్రస్థాయిలో మండిపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ చారిత్రక తప్పిదం చేశారని ధ్వజ మెత్తింది. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈమేరకు క్రిమియాను రష్యా సమాఖ్యలో చేర్చుకుంటూ అధ్యక్షుడు పుతిన్ ఒప్పంద పత్రంపై సంతకం చేసిన కొద్ది సేపటికే అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ మంగళవారం ధ్వజమెత్తారు. ‘చరిత్ర పట్ల అధ్యక్షుడు పుతిన్ ఎలాంటి వివరణనైనా ఇవ్వొచ్చు. కానీ నా ఉద్దేశంలో మాత్రం రష్యా, పుతిన్‌లు క్రిమియా విషయంలో చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారు’ అని అన్నారు.
ఉక్రెయిన్ నేవీ చీఫ్ అరెస్ట్
Published Thu, Mar 20 2014 2:27 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
Advertisement
Advertisement