
వీడు గొప్ప ఆటగాడ్రా ‘బుజ్జి’
బాల్యంలో మనలో చాలామంది దాగుడుమూతల ఆట ఆడే ఉంటాం. ఎవరికీ దొరక్కుండా ఆటలో మనమే గెలవాలని భలే గమ్మత్తయిన ప్రదేశాలను ఎంచుకుని మరీ దాక్కునే వాళ్లం.. అయినా చివరికి ఎలాగోలా దొరికిపోయే వాళ్లం. అయితే ఉక్రెయిన్‌లోని ఏడేళ్ల బుజ్జిగాడు ఓ రోజు దాగుడుమూతలు ఆట ఆడుతున్నాడు. ఎవరూ ఊహించలేని, ఎవరికీ కనబడని ప్రదేశంలో దాక్కొని తానే గెలవాలని అనుకున్నాడు.
దాక్కునే చోటు కోసం చూస్తుండగా పక్కనే ఉన్న వాషింగ్ మెషీన్ బుడతడి కంటికి కనబడింది. ఇదేదో బాగుందే ఎవరికీ కనబడకుండా ఉండొచ్చని వెంటనే దానిలోకి దూరేశాడు. దానిలో దాక్కున్న కొద్దిసేపు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే అర్థమైంది మనోడికి ఈ ప్రదేశం ఏదో తేడాగా ఉందే అని. తక్షణమే దానిలోంచి బయట పడాలని ఎంత ప్రయత్నించినా కుదరకపోవడంతో పెద్దగా అరవడం మొదలు పెట్టాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా వారి వల్ల కాలేదు.
ఎమర్జెన్సీ సర్వీస్‌కి ఫోన్ చేయగా.. నలుగురు పోలీసులు వచ్చి పిల్లాడిని బయటకు తీసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఇక్కడే వారికి ఒక ఐడియా వచ్చింది. వెంటనే సన్‌ఫ్లవర్ నూనెను వాషింగ్ మెషీన్‌లో గుమ్మరించారు. నూనె బాలుడి శరీరానికి అంటుకోవడంతో కాసేపటికి తనంతట తానే బయటకు జారిపడ్డాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.