సాక్షి, ముంబై : 15 ఏళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు చిక్కాడు. ఛీటింగ్ కేసులలో నిందితుడైన అతని కోసం ప్రతీసారి పక్కా సమాచారంతో దాడి చేస్తున్నా... అతను దొరక్కపోవటం పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించేది. చివరకు అతని ఇంట్లోనే నాటకీయ పరిణామాల మధ్య అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్లితే... జూహు ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తిపై 2002 లో ఓ కేసు నమోదు అయ్యింది. బీఈడీ అడ్మిషన్లు ఇప్పిస్తానని చెప్పి కొందరి నుంచి సుమారు 1 లక్ష రూపాయాల దాకా వసూలు చేశాడు. వారి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అతని కోసం వేట ప్రారంభించారు. ఇతగాడు పుణేలో జరిగిన ఓ కోటి రూపాయల స్కామ్‌లో నిందితుడిగా కూడా ఉన్నాడంట.
దీంతో అతన్ని పోలీసులు 15 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నా ఫలితం లేకపోయింది. చివరకు సోమవారం అతను నివసించే అపార్ట్‌మెంట్‌ను మూడు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే అతని భార్య మాత్రం వారిని ఇంట్లోకి అనుమతించలేదు. మూడు గంటల తర్వాత వాళ్లు బలవంతంగా లోపలికి వెళ్లి చూడగా.. వాషింగ్‌మెషీన్ డోర్ నుంచి దుస్తులను బయట పెట్టి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. చివరకు పోలీసులు మూత తెరిచి చూడగా అందులో అతగాడు నక్కి ఉన్నాడు. అవాక్కయిన పోలీసులు చివరకు అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment