
న్యూయార్క్: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి బయో ఉగ్రవాదానికి తెరలేపే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. ప్రాణాంతక వైరస్‌ను ఉగ్రమూకలు ఉన్మాద చర్యలకు వినియోగించుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలకు, అంతర్జాతీయ సమాజానికి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వైరస్ సంక్షోభంపై గురువారం ఐరాసలో తొలిసారిగా డొమీనికన్ రిపబ్లిక్(కరేబియా దేశం) అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐరాస భద్రతా మండలి నుంచి ఆంటోనియో ప్రసంగించారు. కోవిడ్-19పై పోరును.. ‘‘ఈ తరం యుద్ధం- యునైటెడ్ నేషన్స్ అస్తిత్వానికై పోరాటం’’గా ఆయన అభివర్ణించారు.
‘‘మహమ్మారి కోవిడ్-19 తొలుత ఆరోగ్య సంక్షోభంగా పరిణమించింది. అయితే రాను రాను దీని కారణంగా ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ఇది ముప్పుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక అశాంతి, హింస చెలరేగే పరిస్థితులకు దారితీసేలా ఉంది. మహమ్మారిపై పోరుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా లేనట్లయితే అది బయో ఉగ్రదాడులకు దారితీయవచ్చు. అలా అయితే రిస్కు మరింత ఎక్కువవుతుంది. ప్రపంచాన్ని నాశనం చేసేందుకు ఉగ్ర సంస్థలు దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉంది’’అని ఆంటోనియో కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిపై పోరులో ప్రభుత్వాలు తలమునకలైన వేళ ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. అదే జరిగితే అంటువ్యాధిపై పోరులో విజయావకాశాలు సన్నగిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. (గృహహింసకు ముగింపు పలకండి:యూఎన్ చీఫ్)
వారి పరిస్థితి ఏమిటి?
కరోనా విజృంభిస్తున్న తరుణంలో మానవ హక్కుల ఉల్లంఘన మరో ఆందోళనకరంగా అంశంగా పరిణమించిందని ఆంటోనియో పేర్కొన్నారు. బలహీనవర్గాలు, శరణార్థుల పరిస్థితి ఎలా ఉందోనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. విద్వేష ప్రసంగాలు వింటూనే ఉన్నాం. చికిత్స అందించే విషయంలో వివక్షను చూస్తున్నాం. భావ ప్రకటనా స్వేచ్ఛ, మీడియాపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి’’అని ఆంటోనియో వ్యాఖ్యానించారు. కాగా కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 95 వేల మంది మరణించగా.. దాదాపు పదహారున్నర లక్షల మంది దీని బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment