
ఇస్లామాబాద్/ న్యూయార్క్ : కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత కశ్మీర్‌లో కశ్మీరీల పరిస్థితి ఎలా ఉండబోతుందో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు... ఆ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను గురించి వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అదే విధంగా కశ్మీర్ అఖండ భారత్‌లో సంపూర్ణంగా భాగస్వామి కావడం వల్ల ప్రయోజనాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. మోదీ ప్రసంగంపై పెదవి విరిచిన ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుత అంశాలపై స్పందించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని మరోసారి కోరారు. ఈ క్రమంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై జోక్యం చేసుకోవాల్సిందిగా పాక్ రాయబారి మలీహా లోధి ఐక్యరాజ్యసమితికి విఙ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో యూఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ తరఫున ఆయన ప్రతినిధి స్టెఫానే డుజారిక్ మాట్లాడుతూ...‘ 1972లో భారత్, పాకిస్తాన్ చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం గురించి ఆంటోనియో గుటెరస్ గుర్తుచేశారు. జమ్మూ కశ్మీర్‌పై ఇరు దేశాలు శాంతియుతంగా చర్చించి అంతిమ నిర్ణయం తీసుకుంటామని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నాయి. ’ అని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు దేశాలు సంయమనం పాటించాలని... ప్రజల హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆంటోనియో అన్నట్లు పేర్కొన్నారు. కాగా కశ్మీర్ విషయంలో యూఎన్ సహా ఇతరుల జోక్యం అంగీకరించబోమని భారత్ సిమ్లా ఒప్పందంలో స్పష్టం చేసింది.
సిమ్లా ఒప్పందం?
పశ్చిమ, తూర్పు పాకిస్తాన్‌ల మధ్య సంక్షోభం తలెత్తిన సమయంలో తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) పాలకుడు షేక్ ముజ్బీర్ రెహ్మాన్‌కు అండగా భారత్ నిలబడింది. పాక్ ప్రభుత్వ ఆగడాలు భరించలేని బెంగాలీలు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరు బాట పట్టారు. వారికి అండగా నిలిచిన భారత్‌పైకి పాకిస్తాన్ 1971లో యుద్ధానికి దిగింది. ఎన్నో ప్రాంతాలపై దాడులు మొదలు పెట్టింది. ఈ క్రమంలో భారత ఆర్మీ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆ సమయంలోనే పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లో 5,795 చదరపు మైళ్ల భాగాన్ని మన సైన్యం కైవసం చేసుకుంది. రెండువారాల పాటు ఉధృతమైన పోరాటం తర్వాత బంగ్లాదేశ్ విముక్తి పొందింది. ఆ తర్వాత కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందంలో భాగంగా భారత్ కశ్మీర్‌లో తాను సొంతం చేసుకున్న భాగాన్ని పాక్‌కు తిరిగి ఇచ్చేసింది. ఇరు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని, కశ్మీర్‌లో శాంతి నెలకొల్పాలనే భారత్ ఆ నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలో వాస్తవానికి కశ్మీర్ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా పాక్‌కు అత్యంత నష్టం కలిగించింది, భారత్ కశ్మీర్‌లో తిరిగి కొంత భాగాన్ని ఆక్రమించుకుంది ఈ యుద్ధంతోనే.
ఈ క్రమంలో దౌత్యపరంగా బంగ్లాదేశ్‌ను గుర్తించే విధానం, ద్వైపాక్షిక సంబంధాల గురించి 1972లో అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ భుట్టో, భారత ప్రధాని ఇందిరా గాంధీ సిమ్లాలో ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. కశ్మీర్ వంటి అంశాల్లో కూడా ఐక్యరాజ్యసమితి సహా ఇతరుల జోక్యం అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది.
ఇక ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో భారత్ వ్యవహరిస్తున్న తీరుపై స్పందించాల్సిందిగా గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికా.. జమ్మూ కశ్మీర్ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, ఇదే అంశంపై సంయమనం పాటించాలని పాకిస్తాన్‌ను కోరింది. భారత్‌తో వాణిజ్య సంబంధాలకు స్వస్తి పలకడంతో పాటు దౌత్యపరమైన చర్యలతో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దూకుడు పెంచడంతో సంయమనం పాటించాలని అగ్రరాజ్యం సూచించింది. దీంతో పాక్ దూకుడుకు కళ్లెం వేసినట్లు అయ్యింది. అయితే ప్రస్తుతం యూఎన్ కార్యదర్శి సిమ్లా ఒప్పందం గురించి ప్రస్తావించడంతో కశ్మీర్ అంశంపై ఐరాస ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment