200 ఏళ్లలోనే 600 కోట్లు పెరిగిన జనాభా
న్యూయార్క్: ప్రపంచ జనాభా వంద కోట్లకు చేరుకోవడానికి దాదాపు రెండు లక్షల సంవత్సరాల కాలం పట్టగా, ఆ తర్వాత రెండు వందల సంవత్సరాల కాలంలోనే ఆరు వందల కోట్ల జనాభా పెరిగి ప్రపంచంలో ప్రస్తుతమున్న ఏడు వందల కోట్లకు చేరుకొంది. 2050 సంవత్సరం నాటికి జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని, 2,100 సంవత్సరం నాటికి 1100 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
మంచు యుగం నాటి నుంచి ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి 2050 వరకు ప్రపంచ జనాభాలో ఎక్కడెక్కడా ఎలా విస్తరించిందో, భవిష్యత్తులో ఎలా విస్తరిస్తుందో వివిరిస్తూ ‘అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’ ఓ మ్యాపింగ్ వీడియోను రూపొందించి విడుదల చేసింది. మానవ పురోభివృద్ధి, వాతావరణ పరిస్థితులు, వనరుల కారణంగా ప్రపంచ జనాభా గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం ఈ అంశాలతోపాటు వైద్య, సామాజిక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఐక్యరాజ్య సమితీ భవిష్యత్ జనాభాను అంచనా వేసింది.
ప్రపంచంలో వందకోట్ల జనాభా ఏ కాలానికి చేరుకుందో కచ్చితంగా చెప్పడం కష్టమని, ఇప్పుడు ఒక్క ఫేస్‌బుక్‌లోనే వందకోట్ల మంది యూజర్లు ఉన్నారని జనాభా లెక్కలను అంచనా వేసిన నిపుణులు చెప్పారు. భవిషత్తులో వాతావరణ పరిస్థితుల సంరక్షణకు, సహజ వనరుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో జనాభా ప్రాతిపదికన అంచనా వేయడానికి తమ అంచనాలు తోడ్పడతాయని వారు చెబుతున్నారు.