వాషింగ్టన్: మహిళల ప్రాముఖ్యం గురించి ఎవరెన్ని చెప్పినా, భారత్‌లో లింగవివక్ష విపరీతంగా ఉందని ఐక్యరాజ్య సమితి ఆవేదన వ్యక్తం చేసింది. మహిళలపై వేధింపులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని పేర్కొంది. స్త్రీ-పురుషుల సమానత్వం (జెండర్ జస్టిస్) సాధనలో భారత్ చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం మహిళ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ, మరింత కృషి అవసరమని ఐరాస మహిళ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీపురి అన్నారు. లైంగికహింస కేసులపై త్వరగా విచారణ ముగించడానికి ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని అన్నారు. వీరి సమస్యలపై సున్నితంగా వ్యవహరించేలా పోలీసులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్ని పథకాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. ‘జన్‌ధన్ యోజన మహిళలకు ఎంతగానో ఉపయోగపడింది. స్వచ్ఛభారత్, స్కిల్స్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలతోనూ ఎంతో మేలు జరుగుతోంది. ఐరాసలోనూ మహిళల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం’ అని ఆమె వివరించారు. భారత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వారికి మరింత భద్రత అవసరమని అభిప్రాయపడ్డారు. వెనుకబడిన, పేదవర్గాల స్త్రీలూ చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొన్ని సమస్యల ఫలితాలు తక్షణం కనిపించబోవని, భవిష్యత్‌లో పర్యవసనాలు తప్పవని లక్ష్మి హెచ్చరించారు.
‘గత 70 ఏడు శతాబ్దాలుగా భారత్ చాలా అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ పితృస్వామిక వ్యవస్థ బలంగా ఉండటం వల్ల మహిళలు వెనుకబడే ఉంటున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగలేదు. లింగసమానత్వం ఇప్పటికీ కలగానే మిగిలింది. రాజకీయాల్లో మాత్రం కాస్త వృద్ధి కనిపించినా, ఆడసంతానాన్ని ఇప్పటికీ ఏవగించుకుంటున్నారు. విద్యారంగం ఎంతో అభివృద్ధి చెందినా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే ప్రధాని మోదీ ‘బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయితే గృహహింసపై మహిళల్లో చైతన్యం పెరిగింది. ఇది నేరమని వాళ్లు గుర్తించే పరిస్థితి రావడం చాలా పెద్ద విజయం. చట్టసభల్లోనూ మహిళల ప్రాధాన్యం పెరగాలి’ అని లక్ష్మీపురి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment