
అమెరికాలో పలు విమానశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ డెస్క్ కంప్యూటర్లు రెండు గంటలకు పైగా షట్‌డౌన్ అయ్యాయి. దీంతో ఇయర్-ఎండ్ హాలిడేస్‌ను ముగించుకుని అమెరికాలోకి వస్తున్న ప్రయాణికులుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రాసెసింగ్ సిస్టమ్‌లో అంతరాయం రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభమైందని, రాత్రి 9.30కు ఈ సమస్యను పరిష్కరించినట్టు కస్టమ్స్ ఏజెన్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. అన్ని విమానశ్రయాల్లో సాధారణం కంటే ఎక్కువ సమయం సేపు ప్రయాణికులు క్యూలైన్లలో వేచిచూడాల్సి వచ్చిందని తెలిపింది.
ఆ సమయంలో తమ సేవల అంతరాయం హానికరమైనది కాదు అనే ఎలాంటి సూచనను కూడా ఏజెన్సీ ఇవ్వలేదు. ఈ అంతరాయానికి వివరణ ఇవ్వకపోవడంతో, చాలా మంది ప్రయాణికులు, ప్రత్యామ్నాయ ప్రక్రియలను ఎంచుకున్నట్టు తెలిసింది. విదేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశించే ప్రయాణికులు, తాము వేచి ఉన్న లాంగ్ లైన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్. కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, హార్ట్స్‌ఫీల్డ్ జాక్‌సన్ అట్లాంటాఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు వంటి ఇతర ఎయిర్‌పోర్టులు దీని ప్రభావానికి గురయ్యాయి. గతేడాది కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.