'ఉగ్ర' సూత్రధారిని హతమార్చిన అమెరికా
వాషింగ్టన్: పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక్ పాఠశాల, బచ్చా ఖాన్ యూనివర్సిటీల్లో దాడుల సూత్రధారి ఉమర్ ఖలీఫా హతమయ్యాడు. పాకిస్థాన్ తాలిబాన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఉమర్ను అమెరికా దళాలు అప్ఘానిస్థాన్లో మట్టుబెట్టాయి. అమెరికా దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఉమర్తో పాటు అతడి నలుగురు సహాయకులు మృతి చెందినట్టు పెంటగాన్ ధ్రువీకరించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని నాంగర్హర్ ప్రావిన్స్ లో జూలై 9న తమ దళాలు జరిపిన దాడుల్లో ఉమర్, మరో నలుగురు హతమయ్యారని పెంటగాన్ సమాచార ప్రతినిధి పీటర్ కుక్ వెల్లడించారు.
ఉమర్ నరైగా పేరుగాంచిన ఖలీఫాకు పలు ఉగ్రవాద దాడుల్లో సూత్రధారిగా ఉన్నాడు. 2014, డిసెంబర్లో పెషావర్ సైనిక్ పాఠశాలపై ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు. 2015, సెప్టెంబర్లో బదాబర్ ఎయిర్ ఫోర్స్ బేస్ పై దాడి, 2016, జనవరిలో బచ్చా ఖాన్ వర్సిటీపై దాడిలోనూ ఉమర్ ప్రధాన కుట్రదారుడిగా ఉన్నాడు.