కాళ్లు, చేతులు తీసేశారు.. కారణం తెలిస్తే షాక్‌ | His Legs And Forearms Amputated Because Of A Dog Lick | Sakshi
Sakshi News home page

కాళ్లు, చేతులు తీసేశారు.. కారణం తెలిస్తే షాక్‌

Published Fri, Aug 3 2018 11:33 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

His Legs And Forearms Amputated Because Of A Dog Lick - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా విస్‌కాన్సిన్‌కు చెందిన గ్రేగ్‌ మంటఫేల్‌(48) గత నెలలో ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటికే అతని రెండు చేతులను మోచేతుల వరకూ తొలగించారు. మోకాళ్ల కింద భాగాన్ని కూడా తొలగించారు. ఇంకా కొన్ని సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కాళ్లు, చేతులు తొలగించాల్సి వచ్చిందంటే చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యే అయ్యుంటుంది అనుకుంటున్నారా.. అవును గ్రేగ్‌ ఒక అరుదైన బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకడానికి గల కారణం మాత్రం చాలా విచిత్రమైనది. అది ఏంటంటే కుక్క నాకడం వల్ల గ్రేగ్ పరిస్థితి ఇలా తయారయ్యింది. దాంతో లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు గ్రేగ్‌.

వివరాల ప్రకారం.. గత నెలలో గ్రేగ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది, ఫ్లూ లక్షణాలు అనుకోని సమీప ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ గ్రేగ్‌ను పరీక్షించిన వైద్యులు, అతను అరుదైన బ్లడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వైద్యం చేసి చేతులు, కాళ్లను మోచేతులు, మోకాలు వరకూ తొలగించాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. అనంతరం ఆపరేషన్‌ చేసి గ్రేగ్‌ కాళ్లను, చేతులను తొలగించారు. అయినా వ్యాధి ఇంకా పూర్తిగా నయం కాలేదని , మరికొన్ని సర్జరీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

గ్రేగ్‌కు వచ్చిన అరుదైన వ్యాధి గురించి వైద్యులు ‘సాధరణంగా పిల్లులు, కుక్కల లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అయితే దీని గురించి జంతు ప్రేమికులు భయపడాల్సిన పన్లేదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. కాబట్టి మీ పెంపుడు జంతువులను చూసి భయపడాల్సిన పన్లేదు. ఇంతకు ముందులానే మీ పెంపుడు జంతువులతో గడపోచ్చు’ అంటూ తెలిపారు. అయితే గ్రేగ్‌ వైద్య ఖర్చుల నిమిత్తం గోఫండ్‌మి పేజ్‌ను క్రియేట్‌ చేసి విరాళాలు సేకరిస్తున్నారు అతని బంధువులు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement