వాషింగ్టన్(యూఎస్‌ఏ): అఫ్ఘానిస్తాన్ లోని నల్లమందు శుద్ధికేంద్రాలపై అమెరికా వైమానిక బలగాలు భారీగా దాడులు జరిపాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టినట్లు అఫ్ఘానిస్తాన్‌లోని అమెరికా దళాల కమాండర్ జనరల్ జాన్ డబ్ల్యూ నికొల్సన్ జూనియర్ తెలిపారు. ఈ దాడుల్లో బి-52 బాంబర్లు, ఎఫ్-22 యుద్ధ విమానాలు పాల్గొన్నాయని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అఫ్ఘానిస్తాన్‌లో నల్లమందు ఉత్పత్తి 87శాతం మేర పెరిగిందని ఐక్యరాజ్యసమితి పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
దేశంలోని తాలిబాన్ల ఆధీనంలోని ప్రాంతాల్లో పండిస్తున్న నల్లమందుతో ఈ ఏడాది సుమారు 200మిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే నల్లమందులో 85శాతం అఫ్ఘానిస్తాన్‌లోనిదేనని చెప్పారు. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా మొత్తం 500 వరకు నల్లమందు శుద్ధి కేంద్రాలు నడుస్తున్నాయని చెప్పారు. అఫ్ఘానిస్తాన్ మొత్తంమ్మీద ప్రధానంగా 13 డ్రగ్స్ రవాణా ముఠాలు పనిచేస్తుండగా కేవలం హెల్మండ్ ప్రావిన్స్‌లోనే ఏడు నడుస్తున్నాయి. అందుకే తాలిబాన్ ఆధీనంలోని నల్లమందు శుద్ధి కేంద్రాలపై దృష్టిసారించామని, తాజా దాడుల్లో 8 కేంద్రాలను ధ్వంసం చేశామని నికొల్సన్ జూనియర్ తెలిపారు.
అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అఫ్ఘానిస్తాన్‌లో చేపట్టిన పెద్ద దాడి ఇదేనని వివరించారు. భవిష్యత్తులో కూడా దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అఫ్ఘానిస్తాన్‌లో డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు అమెరికా ఏటా 8 బిలియన్ డాలర్లను వెచ్చిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment