వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా రెమ్‌డెసివిర్ మందుపై గుత్తాధిపత్యానికి రంగం సిద్ధం చేస్తోంది. కోవిడ్–19 చికిత్సకు ఉపయోగపడగలదని భావిస్తున్న ఈ మందును భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికన్ కంపెనీ గిలియాడ్ ఉత్పత్తి చేస్తున్న రెమ్‌డెసివిర్ సుమారు ఐదు లక్షల డోసులకు ఆర్డర్లు ఇచ్చేసింది. అమెరికా ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ఇతర దేశాలకు కీలకమైన మందు లభించదని లివర్‌పూల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ హిల్ తెలిపారు. గతంలో ఎబోలా వైరస్ చికిత్స కోసం అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్ కోవిడ్–19 చికిత్సకు కొంతమేరకు ఉపయోగపడుతుందని, తీవ్ర లక్షణాలు ఉన్న వారు కొంచెం వేగంగా కోలుకునేలా చేస్తుందని ఇటీవలే స్పష్టమైంది. గిలియాడ్ గతంలో సుమారు 1.40 లక్షల డోసులను పరీక్షల కోసమని పలుదేశాలకు పంపిణీ చేసింది. ఈ డోసులన్నింటినీ ఇప్పటికే వాడేశారు.
ఈ నేపథ్యంలో గిలియాడ్ జూలై నెల మొత్తమ్మీద ఉత్పత్తి చేసే డోసులతోపాటు ఆగస్టు, సెప్టెంబరు నెలల ఉత్పత్తిలో 90 శాతం వరకూ ఉండే ఐదు లక్షల డోసుల రెమ్‌డెసివిర్ మందును అమెరికా కొనుగోలు చేయడం గమనార్హం. ‘‘అమెరికన్లకు రెమ్‌డెసివిర్ అందుబాటులో ఉండేలా చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గిలియాడ్‌తో అద్భుతమైన ఒప్పందం చేసుకున్నారు’’ అని అమెరికా వైద్యశాఖ మంత్రి అలెక్స్ అజార్ తెలిపారు. కోవిడ్–19 చికిత్స కోసంరెమ్‌డెసివిర్ డోసులు కనీసం ఆరు తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఖరీదు దాదాపు రూ.2.5 లక్షల వరకూ ఉంటుందని అంచనా. పేటెంట్ హక్కులున్న కారణంగా లైసెన్సు పొందిన కంపెనీలు మాత్రమే ఈ మందును తయారు చేయగలవు.
Comments
Please login to add a commentAdd a comment