అమాయకులను చంపినందుకే.. | US drone strike ordered by Trump kills top Iranian commander in Baghdad | Sakshi
Sakshi News home page

అమాయకులను చంపినందుకే..

Published Sun, Jan 5 2020 2:53 AM | Last Updated on Sun, Jan 5 2020 8:32 AM

US drone strike ordered by Trump kills top Iranian commander in Baghdad - Sakshi

బాగ్దాద్‌లో సులేమానీ భౌతికకాయమున్న వాహనాన్ని అభిమానులు అనుసరిస్తున్న దృశ్యం

బాగ్దాద్‌/వాషింగ్టన్‌/బ్రస్సెల్స్‌: వేలాది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నందునే ఇరాన్‌ సైనిక జనరల్‌ సులేమానీని హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. న్యూఢిల్లీ, లండన్‌ వంటి ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాదుల దాడుల వెనుక అతని హస్తముందన్నారు. ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ఉగ్రవాది సులేమానీని తన ఆదేశాలతోనే అమెరికా సైన్యం మట్టుబెట్టిందని, దీంతో అతని శకం అంతమైందని చెప్పారు. ఫ్లోరిడాలోని సొంత రిసార్ట్‌లో శనివారం ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు.  గడిచిన 20 ఏళ్లలో పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించేందుకు కుట్రపన్నారని, అతని కనుసన్నల్లోనే ఇటీవల ఇరాక్‌లోని తమ సైనికులు, ఎంబసీపై దాడులు జరిగాయన్నారు. సులేమానీ మరణంతో ఈ ప్రాంతంలో యుద్ధం ప్రారంభమవుతుందన్న ఆందోళనలను ట్రంప్‌ కొట్టిపారేశారు. ఇరాన్‌ సహా తమను బెదిరించే వారిపై ఎలాంటి చర్య అయినా తీసుకునేంతటి శక్తి అమెరికాకు ఉందని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి పరిమితం
సులేమాని మృతితో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో..ఉగ్రవాదులపై పోరులో ఇరాక్‌ సైన్యానికి సహకరిస్తున్న అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు, నాటో తమ కార్యక్రమాలను నిలిపి వేశాయి. ‘సంకీర్ణ బలగాలను కాపాడుకోవడమే ఈ సమయంలో మాముందున్న లక్ష్యం. ప్రస్తుతానికి సైనిక శిక్షణ, ఉగ్రవాదులపై పోరు వంటి కార్యక్రమాలను పరిమితం చేసుకున్నాం. దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఓ సైనికవర్గాలు వెల్లడించాయి. అమెరికా తాజా డ్రోన్‌ దాడి ఈ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని విశ్లేకులు అంటున్నారు. 2011లో అల్‌ ఖాయిదా చీఫ్‌ లాడెన్, 2019లో ఐఎస్‌ చీఫ్‌ బాగ్దాదీ హతమైనప్పటి కంటే తాజా దాడి ఎక్కువ ప్రభావం చూపనుందని పేర్కొంటున్నారు.

సులేమానీకి అశ్రు నివాళి
సులేమానీ(62)కి వేలాది మంది ప్రజలు అశ్రు నివాళులర్పించారు. శుక్రవారం బాగ్దాద్‌లో విమానాశ్రయం వద్ద అమెరికా డ్రోన్‌ దాడిలోæ సులేమాని, ఇరాకీ పారా మిలటరీ అధిపతి అబుæ ముహందిస్‌ మరణించడం తెల్సిందే. వీరి శవ పేటికలను బాగ్దాద్‌లోని ప్రముఖ షియా మసీదుకు తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఇరాక్‌  ప్రధాని అదెల్‌ అబ్దుల్‌ మహ్దీ,  షియాల మత పెద్ద అమ్మర్‌ అల్‌ హకీం, ఇరాక్‌ మాజీ ప్రధాని నూరి అల్‌ మాలికితోపాటు ఇరాన్‌ అనుకూల ప్రముఖులు పాల్గొన్నారు. మృతదేహాలను షియాల పవిత్ర నగరం నజాఫ్‌కు, అటునుంచి ఇరాన్‌కు తీసుకెళ్లనున్నారు. సులేమానీ హత్యపై ఐరాసలోని ఇరాన్‌ రాయబారి మజీద్‌ తఖ్త్‌ రవంచి స్పందిస్తూ.. తమ బద్ధ విరోధి పాల్పడిన యుద్ధచర్యగా అమెరికానుద్దేశించి పేర్కొన్నారు.

ఇరాన్‌ అనుకూల కాన్వాయ్‌పై మళ్లీ దాడి
అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధ భయాలు అలుముకున్న నేపథ్యంలో శనివారం మరోసారి ఇరాన్‌ అనుకూల ఇరాకీ పారామిలటరీ అధికారి  వాహన శ్రేణి లక్ష్యంగా డ్రోన్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో హషీద్‌ సురక్షితంగా బయటపడగా ‘కొందరు గాయపడ్డారు, కొందరు చనిపోయారు’ అంటూ ఓ అధికారి తెలిపారు. అంతకుమించి వివరాలు వెల్లడి కాలేదు. ముస్లిం తీవ్రవాద సంస్థలపై పోరాటంలో ఇరాక్‌ సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఇప్పటికే అక్కడ 5,200 మంది అమెరికా సైనికులు ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరికితోడు మరో 3,500 మందిని అక్కడకు తరలించనున్నట్లు అమెరికా ప్రకటించింది.

బాగ్దాద్‌లోని అమెరికా స్థావరంపై రాకెట్‌ దాడి
ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని బలాడ్‌ అమెరికా వైమానిక స్థావరంపై శనివారం రాత్రి రాకెట్‌ దాడి జరిగింది. ఒక రాకెట్‌ సురక్షిత ప్రాంతంగా ప్రకటించిన గ్రీన్‌జోన్‌లో పేలగా రెండోది వెలుపల ప్రాంతాన్ని తాకిందని ఇరాక్‌ సైన్యం తెలిపింది. వీటివల్ల నష్టంపై వివరాలను వెల్లడించలేదు. అయితే, రాకెట్ల ప్రయోగ స్థానాన్ని గుర్తించేందుకు డ్రోన్లను పంపినట్లు వివరించింది.


టెహ్రాన్‌లో అమెరికా, ఇజ్రాయెల్‌ జెండాలను తగలబెడుతున్న నిరసనకారులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement