‘యూఎస్ ట్రాప్‌లో భారత్ పడితే.. ఇక అంతే’
బీజింగ్: తమను కట్టడి చేయడంకోసం అమెరికా, జపాన్ ప్రయత్నిస్తున్నాయని చైనా చెప్పింది. అందుకోసం భారత్‌ను వినియోగించుకునే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించింది. ఆ దేశాల వ్యూహంలో భారత్ అనవసరంగా చిక్కుకోవద్దని కోరింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్‌లోని ఎడిటోరియల్ కాలమ్‌లో ఈ మేరకు చైనా ఒక అధికారిక వ్యాసాన్ని వెలువరించింది. అమెరికా, జపాన్ ట్రాప్‌లో చిక్కితే భారత్‌కే ముప్పు ఎక్కువని, సమస్యలు ఉత్పన్నమవుతాయని చైనా హెచ్చరించింది.
‘హిందూ మహా సముద్రంపై చైనాను కట్టడి చేసేందుకు అమెరికా ఢిల్లీని ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. అలాగే, పసిఫిక్ సముద్రంపై తమ దేశంతోపాటు సమానంగా సాగాలని భావిస్తూ ఢిల్లీ సహాయం తీసుకోవాలనుకుంటుంది’ అంటూ గ్లోబల్ టైమ్స్ వ్యాసంలో పేర్కొంది. ఇవన్నీ భారత్‌కు వ్యూహాత్మక అవకాశాలు అని అనిపిస్తాయికానీ, వాస్తవానికి దీని వెనుక పెద్ద మాయాజాలం ఉందని చైనా పేర్కొంది. ఒక్కసారి భారత్ ఆ ట్రాప్‌లో పడిందో అమెరికా ఆడే చదరంగంలో పావులాగా మారిపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎన్నో అవకాశాలను కోల్పోవడంతోపాటు పలు సమస్యలు భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా చైనా హెచ్చరించింది.