![US Judge Rejects Chicago Jail Inmates Plea Seeking Transfers - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/10/jail.jpg.webp?itok=HpLNZVPt)
చికాగో: ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా రక్కసి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. అక్కడ 16,697 మరణాలు సంభవించగా.. 4.5 లక్షలకు పైగా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న మూడు నగరాల్లో ఒకటైన చికాగోలోని కుక్ కౌంటీ జైలు ఖైదీలు పెట్టుకున్న విజ్ఞప్తిని జిల్లా జడ్జి గురువారం తోసిపుచ్చారు. జైల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని, ఇప్పటికే ఒకరు కోవిడ్-19 బారినపడి మరణించారని 4500 ఖైదీలు పిటిషన్‌లో పేర్కొన్నారు. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న జైళ్లకు తమను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
(చదవండి: ఇజ్రాయెల్‌కు ఐదు టన్నులు సరఫరా.. మోదీకి థాంక్స్!)
అయితే, అంత భారీ స్థాయిలో ఖైదీలను బదిలీ చేయడం.. అత్యంత సంక్లిష్ట ప్రక్రియ అని జిల్లా జడ్జి మాథ్యూ కెన్నెల్లీ పేర్కొన్నారు. ఖైదీల పిటిషన్‌ను కొట్టివేశారు. అదేసమయంలో.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారి రక్షణకు చర్యలు ముమ్మరం చేయాలని కుక్ కౌంటీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జైల్లో ఉన్న ఖైదీలకు శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు అందించాలని స్పష్టం చేశారు. కాగా, కుక్ కౌంటీ జైల్లో ఇప్పటి వరకు 276 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒకరు మరణించారు. 172 మంది జైలు సిబ్బందికి కూడా వైరస్ సోకడం గమనార్హం. చిన్న చిన్న నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను బెయిల్‌పై విడుదల చేస్తామని జైలు అధికారులు వెల్లడించారు.
(దక్షిణ భారత్ నుంచి విమానాలు: బ్రిటన్)
Comments
Please login to add a commentAdd a comment