
కారులో పాపను ఒంటరిగా వదిలేసినందుకు..
లాస్ ఏంజిలెస్: అమెరికాలోని లాస్ ఏంజిలెస్లో ఓ వ్యక్తి తన తొమ్మిది నెలల కూతురును పార్కింగ్ వద్ద కారులో ఒంటరిగా వదిలి, స్ట్రిప్ క్లబ్కు వెళ్లినందుకు ఆరేళ్ల జైలుశిక్ష పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు. నిందితుడు ఆవిన్ డార్గిన్ (24)పై పిల్లలను హింసించారనే సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు లాస్ ఏంజిలెస్ జిల్లా అటార్నీ జాకీ లేసీ చెప్పారు. గత మార్చి 9న ఈ సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి.
డార్గిన్ బాధ్యత మరిచి కారులో పాపను ఒంటరిగా వదిలి స్ట్రిప్ క్లబ్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లాడు. పాప ఏడుపు విని సమీపంలో ఉన్నవారు, స్ట్రిప్ క్లబ్ సిబ్బంది వెళ్లి కారులోంచి ఆ పాపను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. క్లబ్లో డాన్స్ చేస్తూ ఆనందంలో మునిగిపోయిన డార్గిన్కు క్లబ్ మేనేజర్ ఈ విషయం చెప్పాడు. పాపకు సరిగా ఊపరి ఆడక అస్వస్థతకు గురవడంతో చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా తాను తప్పు చేయలేదని డార్గిన్ చెబుతున్నా.. నేరం రుజువైతే ఆరేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంది.