యూట్యూబ్ లో 'జెట్' ల్యాండింగ్ హల్ చల్
మనిషి మెదడుకు కాస్త పదును పెడితే అద్భుతాలను ఆవిష్కరించగలడు, చరిత్రను సృష్టించగలడు అనేందుకు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్న ఓ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికన్ యుద్ధ నౌక యూఎస్ఎస్ బతాన్ టేకాఫ్ అవ్వడం ప్రశాంతంగానే జరిగినా... ల్యాండ్ అయ్యే సమయంలో విమానానికి ముందు చక్రాలు తెరచుకోపోవడంతో అత్యంత ఉత్కంఠతను రేపింది. సమయస్ఫూర్తితో ఓ పైలట్ జెట్ విమానాన్ని ల్యాండ్ చేసిన విధానం, చూపరులకు గగుర్పాటును కలిగేట్లు చేస్తోంది.
ఎటువంటి సమస్యా లేకుండా టేకాఫ్ అయిన విమానం... ఆకాశంలోకి ఎగిరాక అనుకోని అవాంతరాలు ఏర్పడితే ఏం చేయాలో.. మెరైన్ క్రాప్స్ పైలట్ విలియమ్ మహోనీ సమయస్ఫూర్తిని చూస్తే తెలుస్తుంది. ఎవి-8బి ల్యాండింగ్ సమయంలో ఏర్పడ్డ సాంకేతిక కారణాలతో విమానం ప్రమాదంలో చిక్కుకుందని తెలిసిన పైలట్... సమయస్ఫూర్తితో వ్యవహరించడం పెను ప్రమాదాన్ని తప్పించింది. జెట్ యుద్ధ విమానం ఫ్రంట్ వీల్స్ తెరుచుకోవడం లేదని గమనించిన పైలట్... ఏమాత్రం భయపడకుండా... ధైర్యంగా వ్యవహరించాడు.
విమానాన్ని సురక్షితంగా కిందికి దించేందుకు కొత్త ప్లాన్ వేశాడు. తన ప్లాన్ ను అధికారులకు తెలిపి వారివద్ద అనుమతి తీసుకున్నాడు. నౌకపై విమానాన్ని దింపేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయించుకొన్నాడు. విభిన్నంగా స్టూల్ పై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించాడు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తిని వేనోళ్ళ అభినందించారు. 2014 జూన్ నెలలో ఫైటర్ జెట్ విమానం ల్యాండింగ్ ఘటనకు సంబంధించిన అరుదైన వీడియో... ఇప్పుడు ఇంటర్నెట్లో అందర్నీ ఆకట్టకుంటోంది. లక్షలకొద్దీ కామెంట్లు, వేలకోద్దీ షేర్లతో హల్ చల్ చేస్తోంది.