ట్రంప్‌కు భారీ షాక్‌.. అభిశంసన | US President Donald Trump Impeached By US House For Abuse Of Power | Sakshi
Sakshi News home page

అభిశంసనకు గురైన ట్రంప్‌

Published Thu, Dec 19 2019 7:49 AM | Last Updated on Thu, Dec 19 2019 9:35 AM

US President Donald Trump Impeached By US House For Abuse Of Power - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ షాక్‌ తగిలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన అభిశంసనకు గురయ్యారు. ప్రతిపక్ష డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్‌ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది. తదుపరి ఆయన సెనేట్‌లో అభిశంసనను ఎదుర్కోనున్నారు. కాగా అమెరికా అధ్యక్ష చరిత్రలో అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు. ఇక 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ నాయకుడు జోయ్‌ బైడన్‌ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉందన్న వార్తల నేపథ్యంలో... బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్‌ ఉక్రెయిన్‌ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బైడన్‌ కుమారుడు హంటర్‌ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి.

ఈ క్రమంలో ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్‌... దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని... బైడన్‌, ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తూ అభిశంసనకు పట్టుబట్టారు. అయితే ట్రంప్‌ మాత్రం వీటిని కొట్టిపడేశారు. ఈ క్రమంలో ఆడం చిఫ్‌ నేతృత్వంలో అభిశంసన విచారణ కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రతినిధుల సభ ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి బుధవారం ఆమోదించింది. దీంతో ట్రంప్‌ అభిశంసనకు గురైనట్లు స్పీకర్‌ నాన్సీ పెలోసీ ప్రకటించారు. ఇక సెనేట్‌లో జనవరి నుంచి ఆయన విచారణ ఎదుర్కోనున్నారు. అయితే సెనేట్‌లో అధికార రిపబ్లికన‍్ల ఆధిపత్యం ఉన్నందు వల్ల ట్రంప్‌ అభిశంసన వీగిపోయే అవకాశం ఉంది.  

అభిశంసన అంటే..?
తీవ్రమైన నేరాలకు పాల్పడిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు గద్ద దింపే ప్రక్రియే అభిశంసన. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర అధికారులు దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, అధికార దుర్వినియోగం వంటి నేరాలకు పాల్పడితే అభిశంసించే అధికారం అమెరికా కాంగ్రెస్‌కు ఉంది.  

ప్రక్రియ ఎలా ?
అధ్యక్షుడిని అభిశంసించి గద్దె దింపడం సులభమేమీ కాదు. దీనికి సుదీర్ఘమైన న్యాయప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ విచారిస్తుంది. అక్కడ ఆరోపణలు రుజువైతే 435 మంది సభ్యులు కలిగిన ప్రతినిధుల సభ సాధారణ మెజారీటీతో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement