
వాషింగ్టన్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్ర ప్రతిచర్యకు దిగాలని భారత్ యోచిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన తరువాత భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని పేర్కొన్నారు. శుక్రవారం చైనా వాణిజ్య ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపిన తరువాత ట్రంప్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పుల్వామా ఉగ్రదాడిపై స్పందించారు. 40 మంది జవాన్లను కోల్పోయిన భారత్ ప్రతీకార చర్యకు దిగాలని కోరుకోవడాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఉగ్రవాదంపై అమెరికా స్పందించిన తరువాతే ఇతర దేశాలు మాట్లాడుతున్నాయని చెప్పారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్‌కు సుమారు 1.3 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపేశాక కూడా ఆ దేశంతో సంబంధాలు మెరుగయ్యాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment