
ఇస్లామాబాద్: భారత సరిహద్దుల్లోని గగనతలంపై విధించిన నిషేధాన్ని పాకిస్తాన్ వరుసగా రెండోసారి పొడిగించింది. మరో రెండు వారాల పాటు ఈ మార్గంలో వాణిజ్య విమాన సేవలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై భారత వైమానిక దళం మెరుపుదాడులు నిర్వహించింది. దీంతో పాక్...భారత సరిహద్దుల్లోని తన గగనతలంపై వాణిజ్య విమానాలు వెళ్లకుండా నిషేధం విధించింది. మే 15తో ఇది ముగియడంతో... ఈ నెల 30 వరకు నిషేధాన్ని పొడిగించింది. తాజాగా వచ్చేనెల 14 వరకు తమ గగనతలంపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. నిషేధం కారణంగా యూరోప్, ఆగ్నేయాసియా విమానాలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment