
డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షబరిలో నిలిచేంతవరకు సామాన్యులెవరికీ పెద్దగా తెలియని పేరు.. ఇప్పుడు అనవసర వివాదాలకు, అనూహ్య నిర్ణయాలకు, అర్థంలేని ట్వీట్లకు, ప్రమాదకర విధానాలకు మారుపేరు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ త్వరలో సంవత్సర పాలన పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏడాదిగా ఆయన పాలనా తీరు, చుట్టుముట్టిన వివాదాలు, నిర్ణయాలపై విశ్లేషణ..
కొరియాతో కొరివి
అమెరికా, మిత్రపక్షాలపై బెదిరింపులకు పాల్పడితే ఉత్తర కొరియాను ఉనికిలో లేకుండా చేస్తామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని సృష్టించాయి. ‘లిటిల్ రాకెట్ మ్యాన్’ అంటూ కిమ్ జోంగ్‌ను రెచ్చగొట్టి.. ఉత్తరకొరియాతో కయ్యానికి కాలు దువ్వారు. అమెరికా ప్రధాన భూభాగంపై క్షిపణి దాడులు చేయగల సామర్థ్యం ఇప్పుడు ఉత్తర కొరియా సొంతం. ఆ దేశంతో జాగ్రత్తగా ఉండాలని గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరికల్ని ట్రంప్ పెడచెవిన పెట్టారు. 2018లో అమెరికాకు ఉత్తరకొరియా, ఇరాన్‌ల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఉన్నతాధికారుల నివేదిక కూడా వెల్లడించింది.
ఉద్వాసనల పర్వం
ప్రభుత్వ వ్యవహారాల్లో ట్రంప్ దుందుడుకు వైఖరి, వివాదాస్పద నిర్ణయాలతో పలువురు ఉన్నతోద్యోగులు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఏడాది కూడా ముగియకుండానే కీలక పదవుల్లోని పలువురు ఉద్వాసనకు గురికాగా.. మరికొందరు ట్రంప్ వ్యవహారశైలి నచ్చక రాజీనామాలు సమర్పించారు. ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమి, జాతీయ భద్రతా సలహాదారు మైక్ ఫ్లిన్ మొదలుకుని, వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి షాన్ స్పైసర్ తదితరులు పదవుల నుంచి వైదొలిగారు.
మిత్రులపైనా విమర్శలు
ఇస్లామిక్ తీవ్రవాదంపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ట్వీటర్‌లో బ్రిటన్ ప్రధాని థెరెసా మే, జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌లపై ట్రంప్ విమర్శలు చేశారు. పొరుగున ఉన్న కెనడా, మెక్సికోలతో ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) పనికి మాలినదని, దానిని సమీక్షిస్తామని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ ట్రంప్ తీసు కున్న నిర్ణయం పెద్ద వివాదానికి తెరతీసింది. దాదాపు ఏడు దశాబ్దాలుగా అమెరికా అనుసరిస్తున్న శాంతియుత వైఖరికి భిన్నంగా తన నిర్ణయంతో అరబ్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు.
వెంటాడుతున్న రష్యా జోక్యం..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా రష్యా జోక్యంపై ఆరోపణల్ని విచారించేందుకు ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ట్రంప్ ప్రచార బృందం మాజీ మేనేజర్ పాల్ మనఫోర్ట్ ప్రమేయంపై ఆధారాలు లభించాయి. మనఫోర్ట్, అతని సహాయకుడు రిక్ గేట్స్‌లపై దేశ వ్యతిరేక కుట్ర, మనీ ల్యాండరింగ్, ఇతర ఆర్థిక ఆరోపణల్ని నమోదుచేశారు. రష్యా అధికారులతో సంబంధాలపై ఎఫ్‌బీఐకి తప్పుడు సాక్ష్యమిచ్చినట్లు ట్రంప్ ప్రచార బృందం సభ్యుడు జార్జి పపడొపౌలోస్ అంగీకరించారు. రష్యాతో తనకు ఎలాంటి రహస్య ఒప్పందం లేదని ట్రంప్ స్పందించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పరోక్షంగా ముల్లర్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘మీ టూ’లో లైంగిక ఆరోపణలు
రాజకీయాల్లోకి రావడానికి కొన్నేళ్ల ముందు ట్రంప్ తమను లైంగికంగా వేధించారని పలువురు మహిళలు ఆరోపించారు. అమెరికాలో ఉన్నతస్థానాల్లోని వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడటంపై ‘మీ టూ’ పేరిట సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున మహిళలు గళమెత్తారు. జెస్సీకా లీడ్స్, రేచల్ క్రూక్స్, సమంతా హాల్వేలు ట్రంప్‌పై తమ ఆరోపణల చిట్టా విప్పారు. ట్రంప్ రాజీనామా చేయాలని, ఆరోపణలపై పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని అమెరికా కాంగ్రెస్‌లోని 58 మంది డెమొక్రటిక్ సభ్యులు డిమాండ్ చేశారు. ట్రంప్ మాత్రం ఈ ఆరోపణల్ని తోసిపుచ్చారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment