అమెరికా, రష్యా కలిసి పోరాడితే మేలు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, హిల్లరీల మధ్య జరిగిన రెండో డిబేట్‌లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా, అమెరికాలు కలిసి ఐసీస్పై పోరాటం చేస్తే బాగుంటుందని ట్రంప్ అన్నారు. ఓవైపు అమెరికా సైట్లను రష్యా హ్యాక్ చేస్తుందని హిల్లరీ ఆరోపించగా.. రష్యాతో కలిసి పోరాటం చేయాలని ట్రంప్ పేర్కొనడం విశేషం. ప్రస్తుతం అమెరికా విదేశాంగ విధానం ఏమాత్రం బాగాలేదని, అమెరికాను హిల్లరీ బలహీనపరిచారని ట్రంప్ ఆరోపించారు
ట్రంప్ రష్యా అనుకూల విధానాలను అవలంభిస్తున్నారని విమర్శిస్తూ వస్తున్న హిల్లరీ.. డిబేట్‌లో పుతిన్ ట్రంప్ను ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ రష్యాతోగాని, పుతిన్‌తోగాని తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ప్రతిదానికి రష్యాను నిందించడం సరికాదని తెలిపిన ట్రంప్.. ఐసీస్‌పై పోరాటంలో ఆదేశంతో కలిసి పనిచేస్తే బాగుంటుందన్నారు. హిల్లరీ మాత్రం ఐసీస్‌ను తుదముట్టించడం రష్యాకు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు.