గుహలో సాహసం ఇలా... | US rescuer details high-risk Thai cave mission | Sakshi
Sakshi News home page

గుహలో సాహసం ఇలా...

Published Thu, Jul 12 2018 3:05 AM | Last Updated on Thu, Jul 12 2018 10:50 AM

US rescuer details high-risk Thai cave mission - Sakshi

ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు విజయసంకేతం చూపిస్తున్న దృశ్యం. (ఇన్‌సెట్లో) అండర్సన్‌

థాయ్‌లాండ్‌లోని ఆ గుహలో ఎక్కడ ఏముందో తెలీనంత కటిక చీకటి. రాళ్లు, బండలతో నిండిన, బాగా ఇరుకైన దారులు. భారీ వర్షాల ధాటికి గుహలోకి నీటి వెల్లువ. ఇన్ని ప్రతికూలతల మధ్య రెండున్నర మైళ్ల దూరం లోపలకు వెళ్లడమే అసాధ్యం. ఇక అక్కడ చిక్కుకుపోయిన, సరిగ్గా ఈత రాని పిల్లలకు దారిలో ఏ అపాయం కలగకుండా కాపాడి బయటకు తీసుకురావడమంటే ఎంతటి సాహసమో ఊహించడం కష్టం. ఇన్ని అవరోధాలను ఎదుర్కొని, అసాధ్యమనుకున్న దాన్ని చేసి చూపిన సహాయక బృందం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలందుకుంది.

మే సాయ్‌/చియాంగ్‌ రాయ్‌: థాయ్‌లాండ్‌లోని థామ్‌ లువాంగ్‌ గుహలో 18 రోజులుగా చిక్కుకున్న మొత్తం 12 మంది బాలురు, వారి ఫుట్‌బాల్‌ జట్టు కోచ్‌ను సహాయక బృందాలు రక్షించి అసాధ్యమనుకున్న దానిని చేసి చూపించాయి. థాయ్‌లాండ్‌తోపాటు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచ్చిన నిపుణులు ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అమెరికా వాయుసేనకు చెందిన డెరెక్‌ అండర్సన్‌ వారిలో ఒకరు. పిల్లలను కాపాడటంలో తనకు ఎదురైన అనుభవాలను ఆయన విలేకరులకు వివరించారు.

జపాన్‌లోని ఒకినవాలో అమెరికా వైమానిక స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్న అండర్సన్‌ తన బృందంతో కలిసి థాయ్‌లాండ్‌లోని గుహ వద్దకు 28న చేరుకున్నారు. ‘ఇది జీవితంలో ఒక్కసారే ఎదురయ్యే సాహసం’ అని ఆయన అన్నారు. గుహలో ఉన్న వారంతా తనకు ఉత్సాహంగానే కనిపించారనీ, ఆ పిల్లలు నిజంగా చాలా హుషారైన వారని అండర్సన్‌ అభివర్ణించారు. ‘ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే కోచ్, పిల్లలు కలిసి మాట్లాడుకుని, ధైర్యంగా ఉండాలనీ, బతుకుపై ఆశ వదులుకోకూడదని నిశ్చయించుకున్నారు.

మేం గుహ వద్దకు చేరుకునే సమయానికి గుహ దారుల్లో పెద్దగా నీరు లేదు. కానీ మేం లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే మూడు అడుగుల ఎత్తున నీటి ప్రవాహం మొదలై మమ్మల్ని బయటకు తోసేయ సాగింది. గుహలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గిపోతుండటం, పిల్లలు జబ్బుపడే ప్రమాదం, వర్షాలు కురిస్తే నీరు నెలల తరబడి గుహలో ప్రవహించడం తదితర కారణాల వల్ల పిల్లలు ఎక్కువసేపు లోపల ఉండటం మంచిది కాదని అనిపించింది’ అని వివరించారు.

స్విమ్మింగ్‌ పూల్‌లో సాధన
డైవర్లు పిల్లలను గుహ నుంచి ఎలా కాపాడాలనే దానిపై ముందుగా ఓ ఈతకొలనులో సాధన చేశారు. లోపల ఉన్న పిల్లలంత ఎత్తు, బరువే ఉన్న పిల్లలను ఎంచుకున్నారు. ‘ఒక్కో పిల్లాడ్ని ఓ డైవర్‌కు కట్టి ఉంచారు. పది మందికి పైగా ఇతర డైవర్లు వెంటే ఉన్నారు. పిల్లాడ్ని పట్టుకునేందుకు, ఆక్సిజన్‌ అందించేందుకు ఇలా చేశారు. ఒక్కో పిల్లాడికి అవసరమైన మాస్కులు తదితరాలు తొడిగి బయటకు తెచ్చేందుకు సిద్ధం చేయడానికే గంటలు పట్టింది. ఇరుకు దారుల్లో ఇరుక్కున్నప్పుడు నీరు మాస్క్‌ల్లోపలికి చేరకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ప్రెషర్‌ మాస్క్‌లను వాడటం కీలకంగా మారింది.

ఆపరేషన్‌లో తాడే కీలకం..
గుహ బయట నుంచి బాలలు ఉన్న ప్రాంతం వరకు 8 మిల్లీ మీటర్ల మందం ఉన్న తాడును సహాయక బృందాలు కట్టారు. ఆపరేషన్లలో తాడే కీలకమనీ, లోపలకు వెళ్లిన వారు బయటకు రావాలంటే తాడును పట్టుకుని రావడం ఒకటే మార్గమని చెప్పారు. ‘ఇక్కడ తాడు జీవన రేఖ. లోపలకు వెళ్లేటప్పుడే బయటకు వచ్చే దారిని ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కో బాలుడిని బయటకు తీసుకొచ్చే సమయంలో గుహలో 100 మందికిపైగా సహాయక సిబ్బంది ఉన్నారు. కొన్ని చోట్ల నీరు లేదుగానీ పెద్ద పెద్ద బండరాళ్లు, ఇరుకైన దారులతో ప్రమాదకరంగా ఉంది’ అని వివరించారు. వారికి మందులు ఇచ్చినందువల్ల పిల్లలను బయటకు తెస్తున్నప్పుడు వారిలో కొంతమంది నిద్రపోయారనీ, మరికొంత మంది కాస్త మెలకువతో ఉన్నారని థాయ్‌లాండ్‌ నౌకాదళంలోని మరో డైవర్‌ చెప్పారు.  

సాహస కథతో హాలీవుడ్‌ సినిమా
పిల్లలను గుహ నుంచి కాపాడటం కథాంశంగా హాలీవుడ్‌లో ఓ సినిమా వస్తోంది. ప్యూర్‌ ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమా తీస్తోంది. దాదాపు 413 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ సినిమాకు కావోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సహ నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది. ప్యూర్‌ ఫ్లిక్స్‌ సీఈవో స్కాట్‌ మాట్లాడుతూ ‘సహాయక బృందాల ధైర్యం, హీరోయిజం స్ఫూర్తి కలిగిస్తున్నాయి’ అని అన్నారు.

సాయంలో భారతీయులు
భారత్‌లో ప్రముఖ నీటి మోటార్‌ పంపుల సంస్థ కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ లిమిటెడ్‌ (కేబీఎల్‌) ఈ సహాయక చర్యల్లో భాగమైంది. పుణె కేంద్రంగా పనిచేసే కంపెనీ సేవలను గుహ నుంచి నీటిని బయటకు తోడటంలో వాడుకోవాలని భారత ఎంబసీ సూచించింది. భారత్, థాయ్‌లాండ్, బ్రిటన్‌లలోని తమ సిబ్బందిని గుహ వద్దకు పంపింది. నీటిని బయటకు తోడటం, మోటార్లను సమర్థంగా వాడటంలాంటి పనుల్లో సంస్థ సిబ్బంది సాయపడ్డారు.

మేము ఆరోగ్యంగా ఉన్నాం
బాలురు వైద్యశాలలో చికిత్స పొందుతున్న తొలి వీడియో బయటకు వచ్చింది. ఆసుపత్రిలో వారి ఫొటోలను కూడా తొలిసారిగా మీడియాకు విడుదల చేశారు. ఇన్నాళ్లూ గుహలో ఉన్నందువల్ల వారికేమైనా ఇన్‌ఫెక్షన్స్‌ సోకి ఉంటాయోమోనన్న అనుమానంతో ముందుజాగ్రత్తగా పిల్లలను వేరుగా ఉంచారు. వారిని కలిసేందుకు తల్లిదండ్రులు సహా ఎవ్వరినీ వైద్యులు అనుమతించలేదు. గాజు అద్దాల గదుల్లో పిల్లలను ఉంచి బయట నుంచే తల్లిదండ్రులు చూసి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేశారు.

అయితే తామంతా ఆరోగ్యంగానే ఉన్నామని పిల్లలు తలలూపుతూ, చేతులు ఆడిస్తూ, శాంతి చిహ్నాలను ప్రదర్శించారు. పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు స్పష్టం చేశారు. అయితే పిల్లల మానసిక ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమనీ, ఇప్పుడు బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా, దీర్ఘకాలంలో వారి ప్రవర్తనపై గుహలో చిక్కుకుపోయిన ప్రభావం ఉండొచ్చని పలువురు మానసిక వైద్యులు అంటున్నారు.

మొరాయించిన మోటార్‌ నీటి పంపు
మంగళవారం చివరి బాలుడు బయటకు వచ్చిన తర్వాత.. గుహ నుంచి నీటిని బయటకు తోడే ప్రధాన పంపు మొరాయించింది. అప్పటికి సహాయక సిబ్బంది ఇంకా గుహ లోపలే, ప్రవేశ ద్వారానికి ఒకటిన్నర కిలో మీటరు దూరంలో ఉన్నారు. పంపు పనిచేయడం మానేయడంతో గుహలో నీటిమట్టం భారీగా పెరగసాగిందని ఆస్ట్రేలియా డైవర్లు వెల్లడించారు. బాలురను బయటకు తీసుకురావడానికి ముందే పంపు మొరాయించినట్లైతే ఆపరేషన్‌కు తీవ్ర ఆటంకం కలిగి ఉండేదన్నారు.   


                సహాయక చర్యల్లో వాడిన నీటినితోడే పంపు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement