'నమ్మండి.. ప్రామిస్.. వాళ్ల అంతు చూస్తాం'
న్యూయార్క్: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రామిస్ చేశారు. ఆయన చేతిలో చెయ్యేసి తాము కచ్చితంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, వారి వ్యవస్థను సమూలంగా దెబ్బకొడతామని వాగ్దానం చేశారు. ప్రస్తుతం నవాజ్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒబామాతో భేటీ అయిన నేపథ్యంలో పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది.
అందులో కాశ్మీర్, భారత్ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు వంటి అంశాలు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, ఉగ్రవాదులను అణిచివేసే విషయంలో పాకిస్థాన్ కాస్త మెతక వైఖరి కనబరుస్తున్నట్లుగా ప్రపంచ దేశాలకు అనిపిస్తుందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండేందుకు తప్పకుండా ఉగ్రవాదంపై యుద్ధం చేయాలని ఒబామా షరీఫ్ కు సూచించారు. ఇందుకు స్పందించిన షరీఫ్.. తాము తప్పకుండా లష్కరే ఈ తోయిబా, హక్కానీ వంటి ఉగ్రవాదుల సంస్థలను అణిచివేసే విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని వాగ్దానం చేశారు. మరోపక్క, భారత్తో కుదుర్చుకున్న పౌర అణుఒప్పందంలాంటి ఒప్పందాలేవీ పాకిస్థాన్ తో కురుర్చుకోలేదని అమెరికా స్పష్టం చేసింది.