వాషింగ్టన్ : జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముష్కరుల విషయంలో పాక్ తీరు మారాల్సిందేనంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. పాక్ ఉగ్రవాదులకు మద్దతివ్వడం.. వారిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని అమెరికా తీవ్రంగా తప్పుపట్టింది. తక్షణమే ముష్కరులకు మద్దతివ్వడాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుందని పాక్‌ను హెచ్చరించింది. పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందంటూ అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రపంచ దేశాల్లో గందగోళాన్ని, హింసను వ్యాప్తి చేయడమే ఉగ్రవాదుల లక్ష్యమని అమెరికా మండి పడింది. ఉగ్రవాదాన్ని అంతం చేయడంలో అమెరికా భారత్‌కు పూర్తి మద్దతిస్తుందని తెలిపింది. రెండు దేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేస్తాయని పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడిని అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడిని అమానవీయ చర్యగా పేర్కొన్న రష్యా ముష్కరుల అంతానికి ప్రపంచ దేశాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఫ్రాన్స్, జర్మనీలు ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment