
సోషల్ మీడియా ఓ ఆయుధం కావాలి!
మెక్సికో: సామాజిక మాద్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ వంటి వాటిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ పిలుపునిచ్చారు. సమానత్వం, మహిళా హక్కులు, విద్యా హక్కుల సాధన కోసం సోషల్ మీడియా ఎంతో ప్రభావవంతమైన ఆయుధంగా ఉపయోగపడుతుందని, దీనిని యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో వివక్ష పూరిత పోస్టులపై యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని, విచక్షణతో ఆలోచించి, స్పందించాలని హెచ్చరించారు.
మెక్సికో నగరంలోని మాంటెరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ హైయ్యర్ ఎడ్యుకేషన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మలాలా ప్రధానంగా సోషల్ మీడియా వినియోగంపైనే ప్రసంగించారు. ‘సోషల్ మీడియాకు కృతజ్ఞతలు. యువత రాజకీయ అంశాల గురించి మాట్లాడుకుంటున్నారంటే అంతా సోషల్ మీడియా కారణంగానే. ఇది అర్థవంతమైన చర్చల దిశగా సాగాలి. సమాజంలో మార్పు కోసం సామాజిక మాద్యమాలను ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలి. అయితే ఇదే మీడియాను ఉపయోగించుకొని తప్పుదోవ పట్టించే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని’ చెప్పారు.