వయాగ్రాతో జర జాగ్రత్త!
వాషింగ్టన్; పురుషుల్లో లైంగిక పటుత్వం మెరుగవటానికి వాడే వయాగ్రాతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మాత్రలు తీసుకునే వారిలో స్కిన్ క్యాన్సర్ సంభవించే అవకాశాలు ఉన్నాయి అని తాజా పరిశోధనల్లో తేలింది. జంతు, మానవ కణాలపై దీనిలోని మెడిసిన్ సిడెన్ఫిల్ చూపించే ప్రభావాన్ని పరిగణలోకి తీసుకొని జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ట్యుబింజెన్ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. చర్మంలోని మాలిగ్నెంట్ మెలనోమా కణాలను వయాగ్రా ప్రేరేపిస్తుందని, దీంతో చర్మ క్యాన్సర్ అవకాశాలు ఉన్నాయని పరిశోధనకు నేతృత్వం వహించిన రాబర్ట్ ఫీల్ తెలిపారు.
ఎవరు పడితే వాళ్లు స్వయం నిర్ణయం తీసుకుని వేసుకోడానికి వయాగ్రా అన్నది జ్వరం తగ్గడానికి వేసుకునే పారాసిటమాల్ లాంటి మందు కాదని, దీనితో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక గుండెజబ్బు లాంటి వ్యాధులకు మందులు వేసుకునే వారిలో ఇది ప్రమాదకరం అంటున్నారు. వయాగ్రాను సరైన స్పెషలిస్ట్‌ల ప్రిస్క్రిప్షన్ మేరకు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.