మాల్యా అరెస్ట్‌..ఆ వెంటనే బెయిల్‌ | Vijay Mallya Arrested in London in Money Laundering Case, Gets Bail | Sakshi
Sakshi News home page

మాల్యా అరెస్ట్‌..ఆ వెంటనే బెయిల్‌

Published Wed, Oct 4 2017 1:56 AM | Last Updated on Mon, Aug 20 2018 4:30 PM

Vijay Mallya Arrested in London in Money Laundering Case, Gets Bail - Sakshi

లండన్‌: మనీ లాండరింగ్‌ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా మంగళవారం లండన్‌లో అరెస్టయ్యారు. ఆ తరువాత ఆయన్ని ఇక్కడి వెస్ట్‌మినిస్టర్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచగా రూ.5.63 కోట్ల పూచీకత్తుపై బెయిల్‌ లభించింది. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు స్కాట్లాండ్‌ యార్డ్‌ గత ఏప్రిల్‌ 18న ఆయన్ని అరెస్ట్‌ చేసినపుడు కూడా బెయిల్‌పై బయటికొచ్చారు.

తర్వాత మాల్యా మీడియాతో మాట్లాడుతూ... తానేం నేరం చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ కట్టుకథలని కొట్టిపారేశారుమాల్యా అప్పగింత కోసం బ్రిటన్‌కు చేసిన విజ్ఞప్తి మేరకే ఆయన్ని అరెస్ట్‌ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత ప్రభుత్వం తరఫున వాదించనున్న యూకే క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ (సీపీఎస్‌) స్పందిస్తూ... మాల్యాపై తాజాగా చేసిన నేరారోపణలు గతంలో చేసిన వాటికి అనుబంధంగానే ఉన్నాయంది.

జూన్‌ 14నే మాల్యాపై భారత్‌లో మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదైందని, ఆయన్ని భారత్‌కు అప్పగించాలని కోరుతూ సెప్టెంబర్‌ చివరన అఫిడవిట్‌ దాఖలు చేశామని తెలిపింది. దీంతో సీపీఎస్‌... భారత్‌కు మాల్యా అప్పగింతను కోరుతూ మంగళవారం మరో విన్నపాన్ని దాఖలు చేసింది. దీన్ని కూడా పాత టైంటేబుల్‌ ప్రకారమే విచారించడానికి జడ్జి ఎమ్మా అర్బుత్‌నాట్‌ అంగీకరించారు. మాల్యాపై మనీ లాండరింగ్‌ కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇప్పటికే ముంబై కోర్టులో చార్జిషీటు దాఖలుచేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement