లండన్: వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో ఊరట లభించింది. భారత్‌కు మాల్యా అప్పగింత కేసును మంగళవారం విచారించిన వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు మాల్యా బెయిల్‌ను మరికొంత కాలం పొడిగించింది. మాల్యాకు బెయిల్ ఇవ్వొద్దన్న భారత ప్రభుత్వం అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. అంతేకాదు మాల్యాను అప్పగిస్తే ఆయనను ఉంచబోయే ముంబై ఆర్దర్ రోడ్డులోని జైలు వీడియోను కోర్టుకు సమర్పించాల్సిందిగా కోరింది. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 12కు వాయిదా వేసింది.
13 భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల మేర ఉద్దేశ పూర్వక రుణ ఎగవేతదారుడు మాల్యాను భారత్‌కు అప్పగింత విషయమై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ఈ రోజు జరిగాయి. ఈ విచారణ నిమిత్తం కోర్టుకు మాల్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాల్యా మీడియాతో మాట్లాడారు. అక్రమంగా డబ్బులను విదేశాలకు తరలించారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అలాగే భారతీయ బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తే చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. తనకున్న రూ.14వేల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి రుణాలు చెల్లిస్తానన్నారు. అలాగే 2015నుంచి ఈ కేసును పరిష్కరించుకునేందుకు తాను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు ఆస్తులను ఎటాచ్ చేసిన తరువాత తాను చేయగలిగింది ఏముందన్న మాల్యా, తుది నిర్ణయాన్ని కోర్టు నిర్ణయిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment