లండన్: భారత బ్యాంకులకు రూ.9 వేల కోట్ల మేరకు రుణాలు ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అప్పగింతపై బ్రిటన్ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. మాల్యాపై బ్యాంకులను మోసగించడం, మనీల్యాండరింగ్ తదితర కేసులు నమోదైన నేపథ్యంలో ఆయనను తమకు అప్పగించాలని భారత్ కోరడంతో లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. కేసు విచారణ సందర్భంగా మాల్యా కోర్టుకు హాజరయ్యారు. తనపై అభియోగాలను కొట్టిపారేసిన మాల్యా.. ఇవన్నీ నిరాధారమని, ఉద్దేశపూర్వకంగా చేసిన అభియోగాలని చెప్పారు.
కాగా, మాల్యా కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానంలో ఫైర్ అలారం మోగడంతో విచారణకు ఆటంకం ఏర్పడింది. కోర్టు రూమ్‌ను ఖాళీ చేయించడంతో మాల్యా, ఇతరులు కోర్టు బయటే వేచి ఉన్నారు. అనంతరం కేసు విచారణ కొనసాగింది. మాల్యాపై విచారణ ఈ నెల 14 వరకూ కొనసాగనుంది. ఈ కేసులో న్యాయమూర్తి ఎమ్మా లూయీస్ ఆర్బుత్‌నాట్ వచ్చే ఏడాది ప్రారంభంలో తీర్పు వెలువరించే అవకాశం ఉంది. మాల్యా తరఫున యూకే మాట్రిక్స్ చాంబర్స్‌కు చెందిన బారిస్టర్ క్లేర్ మాంట్గోమరి నేతృత్వంలోని న్యాయవాదుల బృందం.. భారత ప్రభుత్వం తరఫున క్రౌన్ ప్రొటెక్షన్ సర్వీస్(సీపీఎస్) నేతృత్వంలోని బారిస్టర్ మార్క్ సమ్మర్స్ బృందం వాదనలు వినిపించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment