మాల్యాకు ఈడీ సమన్లు...
♦ ఐడీబీఐ కేసులో 18న విచారణకు హాజరు కావాలని ఆదేశం
♦ కేఎఫ్‌ఏ మాజీ సీఎఫ్‌వో విచారణ
ముంబై: ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఎగవేసిన కేసుకు సంబంధించి ఆ సంస్థ ప్రమోటరు విజయ్ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 18న హాజరు కావాలంటూ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే తన వ్యక్తిగత ఆర్థిక వివరాల పత్రాలు సమర్పించాలని సమన్లలో సూచించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (కేఎఫ్‌ఏ) మాజీ సీఎఫ్‌వో ఎ. రఘునాథన్‌ను ఈడీ ప్రశ్నించింది. వివిధ ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకునేందుకు ఆయన్ను ప్రశ్నించడం కీలకమైనదని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఐడీబీఐ బ్యాంకుకు దాదాపు రూ. 900 కోట్లు ఎగవేసిన అంశంలో మనీలాండరింగ్ కోణానికి సంబంధించి బ్యాంకు మాజీ సీఎండీ యోగేశ్ అగర్వాల్‌తో పాటు కింగ్‌ఫిషర్ సంస్థ అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేఎఫ్‌ఏ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి మాల్యా వ్యవహార శైలే కారణమని, ఆయన ఆదేశాల ప్రకారమే తాను నడుచుకున్నానని గత నెలలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్‌ఎఫ్‌ఐవో)కి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో రఘునాథన్ తెలిపారు.
సేవా పన్ను కేసుపై విచారణ వాయిదా..
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని చీఫ్ విజయ్ మాల్యా నుంచి రూ. 32 కోట్లు రికవరీ చేసుకోవడానికి సేవా పన్ను విభాగం వేసిన రెండు పిటీషన్లపై విచారణను బాంబే హైకోర్టు మార్చి 28కి వాయిదా వేసింది. 2010-11లో కేఎఫ్‌ఏ ప్రయాణికుల నుంచి వసూలు చేసినా.. ఖజానాకు జమ చేయని సర్వీస్ ట్యాక్స్ రికవరీ కేసులో మాల్యాకు మేజిస్ట్రేట్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సేవా పన్ను విభాగం పిటీషన్ వేసింది. ఏప్రిల్ 6న తదుపరి విచారణ కోసం మాల్యా సహా ఇతర డెరైక్టర్లు ట్రయల్ కోర్టు ముందు, హైకోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశించాలంటూ కోరింది.
డీఆర్‌టీ ఆదేశాలను పరిశీలిస్తాం: డియాజియో
మాల్యాకి ఇచ్చే 75 మిలియన్ డాలర్లను నిలిపివేయాలని డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్‌టీ) ఇచ్చిన ఆదేశాలను సమీక్షించనున్నట్లు బ్రిటన్ లిక్కర్ సంస్థ డియాజియో తెలిపింది. డీఆర్టీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే ప్రక్రియలో ఉన్నట్లు తమకు తెలిసిందని, పూర్తి వివరాలు అందుబాటులోకి వచ్చాక తాము సమీక్షిస్తామని సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే, తాము ఇప్పటికే 40 మిలియన్ డాలర్లు మాల్యాకు చెల్లించేసినట్లు వివరించారు. బ్యాంకులకు దాదాపు రూ. 9,000 కోట్ల ఎగవేతకు సంబంధించి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, మాల్యాపై సీబీఐ మొదలుకుని ఈడీ దాకా పలు దర్యాప్తు సంస్థలు కేసులు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడంతో వివాదం తీవ్ర రూపు దాలుస్తోంది.